దేశానికే మార్గదర్శి

– ‘తెలంగాణ ప్రగతి పథం’
– పుస్తకావిష్కరణలో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే దేశానికే మార్గదర్శిగా నిలిచిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. నీటిపారుదల, పరిశ్రమలు, వైద్యం, గిరిజన సంక్షేమం, చేనేత జౌళి, పట్టణ మౌలిక సదుపాయాలు, ఐటీ, ఆర్థిక శాఖల ప్రగతి వివరాలు పొందుపరిచిన ‘తెలంగాణ ప్రగతి పథం’ టేబుల్‌ బుక్‌ను సోమవారం నాడాయన సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో స్వీయపాలనా సామర్ధ్యాన్ని విమర్శించిన వారికి ఈ బుక్‌లెట్‌ సరియైన సమాధానాలు ఇస్తుందని అన్నారు. అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరామని చెప్పారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ తెలుగు విభాగం కోఆర్డినేటర్‌ సువర్ణ వినాయక్‌, భాషా విభాగం సభ్యులు సంబరాజు రవి ప్రకాష్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓఎస్డీ విద్యాసాగర్‌ తదితరులను ముఖ్యమంత్రి అభినందించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ కార్యదర్శి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Spread the love