ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు అన్యాయం : ఎన్‌పీఆర్‌డీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్‌, ఎం అడివయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. రోస్టర్‌ 10 లోపు తగ్గించేందుకు స్టేట్‌ సబర్డినెట్‌ సర్వీస్‌ రూల్స్‌ సవరించాలని డిమాండ్‌ చేశారు. నామినేటెడ్‌ పదవుల్లో రిజర్వేషన్లు అమలు కోసం అసెంబ్లీలో చట్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉచిత విద్యుత్‌, ప్రయాణ సౌకర్యం,తదితర డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. పబ్లిక్‌ సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ చిల్డ్రన్‌ డిజేబుల్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్‌ శాఖ జారీ చేసిన జీవో నెంబర్‌ 10లో రోస్టర్‌ పాయింట్లు అంధులకు 6, మూగ చెవిటి వారికి 31, శరీరక వికలాంగులకు 56, ఆటిజం, మానసిక వికలాంగులు 82 ప్రకారం ఉద్యోగాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తుచేశారు. దీని ప్రకారం శారీరక వికలాంగులకు ఆటిజం, మానసిక వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్టేట్‌ సబర్దినెట్‌ సర్వీస్‌ రూల్స్‌కు సవరణ చేసి శారీరక వికలాంగులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరగుజ్జు వికలాంగులకు ఆర్టీసీ రాయితీ బస్సు పాసులు ఇవ్వాలనీ, గతంలో ఆ సంస్థ అధికారులు సర్క్యులర్‌ విడుదల చేశారనీ, దాన్ని అమలు చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన యూనిక్‌ డిసెబుల్డ్‌ గుర్తింపు కార్డును ప్రభుత్వ పథకాలకు వర్తింప చేయాలని డిమాండ్‌ చేశారు. పర్యాటక కేంద్రాల్లో వికలాంగులకు ఉచిత ప్రవేశం సౌకర్యం కల్పించాలని కోరారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నడుస్తున్న మెట్రో రైలులో వికలాంగులకు ఉచిత పాసులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో రాష్ట్ర ్ట కోశాధికారి ఆర్‌ వెంకటేష్‌,ఉపాధ్యక్షులు జెర్కోనీ రాజు, టి మధు బాబు, సహాయ కార్యదర్శలు బలిశ్వర్‌, దశరథ్‌, ఉపేందర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు శశికళ, బి స్వామి, భుజంగ రెడ్డి, ప్రకాష్‌, బాలకృష్ణ, లింగన్న, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love