ఎంపీ ప్రజ్వల్‌పై సస్పెన్షన్ వేటు..

నవతెలంగాణ – బెంగళూరు: హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అదే సమయంలో జేడీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కోర్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే..ఈ పరిణామానికి ముందు ప్రజ్వల్ బాబాయ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి. కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం వెనక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ హస్తం ఉందని ఆరోపించారు. వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ‘‘ఆ వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కనిపిస్తోందా..? అవి అతడివేనన్న ఆధారం ఏంటి..? అయినా సరే నైతికత ఆధారంగా చర్యలు ఉంటాయి’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై సిట్‌ దర్యాప్తు చేస్తోందన్న మాజీ సీఎం.. వీడియో క్లిప్పులు ఉన్న పెన్‌డ్రైవ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపిణీ చేశారనే విషయాలపైనా దర్యాప్తు సాగాలన్నారు.

Spread the love