‘మహబూబాబాద్‌’ అరెస్టులు అప్రజాస్వామికం

– బస్సుయాత్రను అడ్డుకోవడాన్ని ప్రతిఘటించిన
– సాగర్‌, శ్రీరాంనాయక్‌ను అరెస్టు చేయడం అన్యాయం
– నేడు, రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలు : తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మహబూబాబాద్‌లో బస్సు యాత్రను అడ్డుకోవడాన్ని ప్రతిఘటించిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. శ్రీరాంనాయక్‌ను అరెస్ట్‌ చేయడాన్ని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఖండించింది. అరెస్టులకు నిరసనగా సోమ,మంగళవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈమేరకు ఆదివారం వేదిక రాష్ట్ర నాయకులు పాలడుగు భాస్కర్‌, ఆర్‌ వెంకట్రాములు, మల్లు లక్ష్మి, ఎంవి రమణ, స్కైలాబ్‌బాబు, అనగంటి వెంకటేష్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. మహబూబాబాద్‌లో భూపోరాట కేంద్రంలో లాఠీచార్జికి గురైన పేదలను పరామర్శించేందుకు వెళ్లిన వారిపై దౌర్జన్యం చేసి అరెస్టు చేయడమేంటని వారు ప్రశ్నించారు. యాత్ర బస్సు డ్రైవర్‌ రవిపై చేయి చేసుకోవడాన్ని, బలవంతంగా బస్సును పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సాగర్‌, శ్రీరాంనాయక్‌ను అరెస్టు చేయడం, ఈ ఘటనలను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కెమెరామెన్లపై దాడి చేయడాన్ని తప్పుపట్టారు. ప్రజలు ప్రజాస్వామికవాదులు ఇలాంటిచర్యలను ఖండించాలని కోరారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
బస్‌ యాత్రపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించండి : ఎస్‌ఎఫ్‌ఐ
రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు ఇండ్లు స్థలాలు ఇవ్వాలని కోరుతూ ప్రజాసంఘాల పోరాట వేదిక చేపట్టిన బస్‌ యాత్రను పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ ) పేర్కొంది. పోలీసుల చర్యలను ఖండించాలని పిలుపునిచ్చింది. ఈమేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.ఎల్‌.మూర్తి టి.నాగరాజు ఒక ప్రకటనలో విడుదల చేశారు. గుడిసెలు వేసుకుని బతుకుతున్న పేద ప్రజల గుడిసెలను మహబూబాబాద్‌ పోలీసులు ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గుడిసెలు వేసుకున్న అందరికీ ఇండ్లు స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు, రియల్టర్లకు సాగిలబడి పేదల తరుపున పోరాడుతున్న వారిపై జులుం ప్రదర్శించడాన్ని మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఖండించాలని వారు కోరారు.
బస్సు జాతపై పోలీసుల దాడి అమానుషం.. :ఎన్‌పీఆర్‌డీ
తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జరుగుతున్న బస్సు జాతాను ఆదివారం మహబూబాబాద్‌ లో పోలీసులు అడ్డుకోవడం అమానుషమని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్‌, ఎం అడివయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతితో జరుగుతున్న జాతాను అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. రెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలనీ, జాతాకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Spread the love