విద్య కార్పొరేటీకరణను తరిమికొడదాం

– ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, నాగరాజు
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో విద్య కార్పొరేటీకరణను తరిమికొట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుంటామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్‌ మూర్తి, టి. నాగరాజు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా జరుగుతున్న భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ సమావేశాలు సోమవారం ముగిసాయి. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను పూర్తిగా విస్మరిస్తుందని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ కూడా అందలేదని తెలిపారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న టీచర్‌, లెక్చరర్‌ పోస్టులు, నాన్‌ టీచింగ్‌ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వ నియంత్రణ ఉండకపోవడం సిగ్గుచేటన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్స్‌, స్కాలర్‌షిప్స్‌ వెంటనే విడుదల చేయాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. సమావేశాల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు టి రవి, గర్ల్స్‌ కన్వీనర్‌ పూజ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అరుణ్‌, అజరు, నాయకులు అల్తాఫ్‌, స్టాలిన్‌, అవినాష్‌, నితిన్‌, మణికంఠ, వర్దిని, దీపక్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love