గర్భవిచ్ఛిత్తికి అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకున్న సుప్రీంకోర్టు

నవతెలంగాణ- న్యూఢిల్లీ : అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతించిన సంచలన తీర్పుని సుప్రీంకోర్టు మంగళవారం వెనక్కి తీసుకుంది. మైనర్‌ బాలిక తల్లిదండ్రుల నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిజెఐ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ధర్మాసనం తమ ఛాంబర్‌లో విచారణకు స్వీకరించగా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యా భాటి, మైనర్‌ తల్లిదండ్రుల తరపు న్యాయవాదితో సంభాషించారు. బాలిక డెలివరీ అయ్యేంత వరకు వేచి చూస్తామని తల్లిదండ్రులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయమూర్తులకు తెలిపారు. తల్లిదండ్రుల విజ్ఞాపనను ఆమోదించిన ధర్మాసనం ఏప్రిల్‌ 22 నాటి ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద తనకు లభించిన అసాధారణ అధికారాలను వినియోగించి బాధిత బాలికకు పూర్తి న్యాయం చేయడానికి సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 22న గర్భవిచ్ఛిత్తికి అనుమతించిన సంగతి తెలిసిందే.

Spread the love