మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు..

– రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం
– కమ్యూనిస్టులను విమర్శించడం సిగ్గుచేటు : సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి
నవ తెలంగాణ సిద్దిపేట అర్బన్‌
కమ్యూనిస్టులను నమ్మొద్దని, వారికి కార్యకర్తలే లేరని, అంగన్వాడీ, ఆశాలు.. కమ్యూనిస్టుల ఉచ్చులో పడొద్దని మంత్రి హరీశ్‌రావు ఆదివారం సిద్దిపేటలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి విమర్శించారు. సిద్దిపేటలో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. కమ్యూనిస్టులు అవకాశవాదులే అయితే మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతు ఎందుకు తీసుకున్నారో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. కమ్యూనిస్టులు లేకుండా మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలుపే లేదని గుర్తుంచుకోవాలన్నారు. హరీశ్‌రావు మాటలు చూస్తుంటే ఓడెక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడెక్కినాక బోడి మల్లన్న అన్న సామెతలా ఉందని విమర్శించారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, స్కీం వర్కర్ల సంఘాలు.. టీఆర్‌ఎస్‌ ఏర్పడక ముందు నుంచే ఉన్నాయని, వాళ్ల హక్కుల కోసం పోరాడుతున్నారని, వారికి అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నది కమ్యూనిస్టులు మాత్రమేనని స్పష్టంచేశారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి కార్మికుల ఓట్లు వేసుకొని మోసం చేయడం అధికార పార్టీ నాయకులకు నైజంగా మారిందన్నారు. ఎర్రజెండా అంటేనే కార్మికవర్గమని, వారి హక్కుల కోసం ఎంతకైనా పోరాడుతుందన్నారు. ఇలాంటి మాటలతో కార్మికవర్గ ఐక్యతను దెబ్బతీయలేరని తెలిపారు. కమ్యూనిస్టులపై అక్కసు వెళ్లగక్కడం మానుకొని, దేశంలో, రాష్ట్రంలో మతోన్మాద రాజకీయాలు చేస్తూ, అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. కమ్యూనిస్టులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతోందన్నారు. ప్రజల కోసం ఎర్రజెండా నీడన ఎంతో మంది త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఆ త్యాగాల స్ఫూర్తితో మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామన్నారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాముని గోపాలస్వామి, రాళ్లబండి శశిధర్‌, జిల్లా కమిటీ సభ్యులు చొప్పరి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love