సేవల్లో ఘనం.. సిబ్బందిలో నిరుత్సాహం

– ఉద్యోగుల్లో ఆందోళన తీవ్రతరం
– వైద్యరంగంలో దేశంలోనే మూడో స్థానం
– నిరసన బాట పట్టిన సెకెండ్‌ ఏఎన్‌ఎంలు
– వైద్యగర్జన దిశగా డాక్టర్ల అడుగులు
– నర్సింగ్‌ డైరెక్టరేట్‌ కోసం నర్సుల వినతులు
– ఉపకారవేతనాల పెంపు కోసం ఆయుష్‌ విద్యార్థుల దీక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైద్యారోగ్యరంగం దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. కేరళ, తమిళనాడు తర్వాత మనమే. పలు కొలమానాలు, ప్రమాణాల్లో నెంబర్‌వన్‌. వంద శాతం ఆస్పత్రుల డెలివరీల్లో నెంబర్‌వన్‌. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసూతిలను పదేండ్లలో రెట్టింపు చేసిన ఘనత. కేసీఆర్‌ కిట్‌, కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌, ఆస్పత్రుల్లో పరికరాలకు వెంటనే మరమ్మతులు చేసేందుకు ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ వ్యవస్థ, మూడు నెలల ముందే అయిపోయే మందులకు ఇండెంట్‌, అన్ని మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు…ఇలా పలు విషయాల్లో ప్రజారోగ్య వ్యవస్థ గతంతో పోలిస్తే మెరుగైంది. అదే సమయంలో ఆ శాఖలో ఉద్యోగులు మాత్రం నిత్యం అసంతృప్తి గళం వినిపిస్తూనే ఉన్నారు. ఈ శాఖలో ఎక్కువ సంఖ్యలో కాంట్రాక్టు, పొరుగు సేవల ప్రాతిపదికన సేవలందించే వారి సంఖ్య అధికంగా ఉంది. తాము అందిస్తున్న సేవలను క్రమబద్ధీకరించడం లేదనీ, శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదనీ, సకాలంలో పదోన్నతులు కల్పించడం లేదనీ….ఇలా రకరకాలుగా కేడర్ల వారీగా ప్రభుత్వానికి తమ సమస్యలను ఏకరవు పెడుతూనే ఉన్నారు. వైద్యారోగ్యశాఖలోని రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు, వైద్యవిధాన పరిషత్‌ విభాగాల్లో పని చేస్తున్న డాక్టర్లు తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ఆల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో విభాగాల వారీగా కొంత కాలం పోరాడిన డాక్టర్లు ఉమ్మడి ఐక్యచరణకు పూనుకున్నారు. తమ డిమాండ్లను విడుదల చేశారు. తమ సత్తా చాటాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయా విభాగాల అధిపతులతో పాటు ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ కలిసి వినతిపత్రం సమర్పించారు. 2016 పీఆర్సీ వేతన బకాయిలు 2023 వరకు విడుదల, వైద్యవిధాన పరిషత్‌ సిబ్బందికి ట్రెజరీ జీతాలు, డీహెచ్‌ పరిధిలో, ఈఎస్‌ఐలో వైద్యులకు నిర్ణీత కాల వ్యవధి ప్రమోషన్లు, పల్లె ధవాఖానాల్లో డాక్టర్ల క్రమబద్దీకరణ డిమాండ్లతో త్వరలో వైద్యగర్జన నిర్వహిస్తామని ఆల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో త్వరలో ప్రభుత్వంతో వైద్యుల సమావేశం ఏర్పాటు చేస్తామని రిజ్వీ హామి ఇవ్వడం గమనార్హం.
సెకెండ్‌ ఏఎన్‌ఎంలు రాష్ట్రంలో నాలుగు వేలకు పైగా ఉన్నారు. వీరితో పాటు వివిధ పేర్లతో కాంట్రాక్టు పద్ధతిలో ఏఎన్‌ఎంలు సేవలం దిస్తున్నారు. తమ సేవలను రెగ్యులర్‌ చేయాలని ఎంతో కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. 15 ఏండ్లకు పైబడి సేవలందిస్తున్న తమలో చాలా మందికి రెగ్యులర్‌ ఉద్యోగ వయోపరిమితి కూడా దాటిపోయింది. వీరి డిమాండ్‌ను కాదని ప్రభుత్వం వెయ్యికిపైగా రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో గత 10 రోజులుగా సెకెండ్‌ ఏఎన్‌ఎంలు, ఇతరులు ఆందోళన బాట పట్టారు. వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు.
ఇప్పటికే ఆగస్టు 15 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్టు తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌) ప్రకటించిన విషయం విదితమే.
ఆయుష్‌ విద్యార్థులు ప్రతి రెండేండ్లకు ఒకసారి పెంచాల్సిన 15 శాతం ఉపకారవేతనాన్ని పదేండ్లుగా పెండింగ్‌ లో పెట్టారంటూ నిరసన బాట పట్టారు. పీజీలు, హౌస్‌ సర్జన్లు గత 10 రోజులుగా విధులు బహిష్కరించి ఆస్పత్రుల ముందు ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు రెగ్యులర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీ కోసం కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు వెయిటేజీ కల్పించడం, అవుట్‌ సోర్సింగ్‌ వారికిచ్చిన వెయిటేజీపై న్యాయవివాదం నెలకొనడంతో వారంతా ప్రభుత్వం వైపు చూస్తున్నారు.
నర్సులకు సంబంధించి నర్సింగ్‌ ఆఫీసర్‌గా పేరు మార్పుతో పాటు నర్సింగ్‌ డైరెక్టరేట్‌ ఏర్పాటు వంటివి ఏండ్ల తరబడి నాన్చుతుండటం కూడా వారిని అసహనానికి గురి చేస్తున్నది. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ కేడర్ల వారీగా ప్రభుత్వం చర్చించి సమస్యలను పరిష్కరించాలని ఆయా కేడర్ల ఉద్యోగులకు కోరుకుంటున్నారు.

Spread the love