నాడు-నేడుతో నేను తెచ్చిన మార్పు ఇదే-విద్య, వైద్యరంగాలపై అసెంబ్లీలో జగన్ కీలక ప్రసంగం


ఏపీలో విద్య, వైద్య రంగాల్లో అమలవుతున్న నాడు-నేడు కార్యక్రమంపై ఇవాళ అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. ఇందులో ముందుగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అనంతరం చర్చకు ముగింపుగా ప్రసంగించిన సీఎం జగన్.. రాష్ట్రంలో ఏ స్ధాయిలో నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారో సుదీర్ఘంగా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మార్పులకు తగినట్లుగా రాష్ట్రంలో నాడు-నేడు కార్యక్రమం చేపట్టినట్లు సీఎం జగన్ తెలిపారు.
నాడు-నేడుపై జగన్ ప్రసంగం రాష్ట్రంలో దశాబ్దాల క్రితం నెలకొల్పిన స్కూళ్లలో విద్యార్ధులు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం జగన్ తెలిపారు. ఈ దశలో ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రభుత్వ స్కూళ్లను అలాగే ఉంచి కార్పోరేట్ స్కూళ్లను ప్రోత్సహించేందుకు తాము సిద్ధంగా లేమని, అందుకే పోటీ ప్రపంచానికి తగ్గటుగా విద్యార్ధుల్ని, స్కూళ్లను మార్చేందుకు నాడు-నేడు చేపట్టామన్నారు. వైసీపీ అధికారంలోకి రాకముందు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం లేదని, సీబీఎస్ఈ చదువులు లేవని, ప్రభుత్వ రంగంలో స్కూళ్లే లేకుండా చేసే ప్రయత్నాలు జరిగాయని, కార్పోరేట్ రంగంలో కొందరి కోసమే ఇలా చేశారని జగన్ తెలిపారు. మౌలిక సౌకర్యాలు లేకపోయినా, డ్రాపౌట్లు పెరుగుతున్నా పట్టించుకోలేదన్నారు.

Spread the love