న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఎజెన్సీలు భారత వృద్థి రేటు అంచనాలకు కోత పెడుతూనే ఉన్నాయి. తాజాగా ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) కూడా దేశ వృద్థి రేటు అంచనా లను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) దేశ జీడీపీ 7శాతానికే పరిమితం కావొచ్చని విశ్లేషించింది. ఇంతక్రితం 7.2 శాతంగా పేర్కొంది. ఏషియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ 2022 సప్లిమెంట్‌లో ఆసియా దేశాల వృద్ధిరేటు అంచనాను 4.3 శాతానికి కోత పెట్టింది. గతంలో దీన్ని 5.2 శాతంగా అంచనా వేసింది. భారత్‌లో అంచనాలను మించిన ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వల్ల వృద్థి తగ్గనుందని పేర్కొంది. ధరల పెరుగుదల దేశీయ వినియోగంపై ప్రతికూల ప్రభావం చూపనుందని తెలిపింది. 2022-23లో భారత వృద్థి రేటు 7 శాతంగానే నమోదు కావొచ్చని ఇంతక్రితం రోజు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ పేర్కొన్న విషయం తెలిసిందే.