దొడ్డి కొమురయ్య బలిదానం వృథా కాదు

– ఆయన ఆశయ సాధనకు పాటుపడదాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి
– రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి కార్యక్రమం
నవతెలంగాణ- విలేకరులు
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య బలిదానం వృథాకాదని, అతని ఆశయ సాధన కోసం పాటుపడుదామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన కృషి కొనియాడారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పెద్దబండ ఎఫ్‌సీఐ ఫంక్షన్‌హాల్‌లో దొడ్డి కొమురయ్య వర్ధంతి సభ నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి జూలకంటి రంగారెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు
దొడ్డి కొమురయ్య బలిదానం వృథా కాదు తుమ్మల వీరారెడ్డి, డబ్బికారు మల్లేశ్‌, బండారు రవికుమార్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తదితరులు నివాళులర్పించారు.
తొలి అమరుడు కొమురయ్య : మంత్రి జగదీశ్‌రెడ్డి
తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య తొలి అమరుడని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావుతో కలిసి మంత్రి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సాయుధ రైతాంగ పోరాటంలో కొమురయ్య వీరోచిత పోరాటాన్ని మంత్రి గుర్తు చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూదాన్‌ పోచంపల్లిలో జీఎంపీఎస్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. రామన్నపేట మండల కేంద్రంలో సీపీఐ(ఎం) దొడ్డి కొమురయ్యకు నివాళి అర్పించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ భవన్‌లో దొడ్డి కొమురయ్య వర్ధంతి నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు హాజరై కొమురయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతిని హైదరాబాద్‌లోని విద్యానగర్‌ సీపీ భవన్‌లో సీపీఐ(ఎంఎల్‌) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.గోవర్ధన్‌ మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా జరిగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందు భాగాన నిలిచిన వ్యక్తి దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.

Spread the love