గుడిసెల పోరు ఉధృతం

– పేదలకు అండగా సీపీఐ(ఎం), ప్రజాసంఘాలు
– ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వజాగాల్లో ఉద్యమం
– 50 కేంద్రాలు 850 ఎకరాల్లో గుడిసెలు వేసిన 48 వేల కుటుంబాలు
– పలుచోట్ల పక్కా ఇండ్ల నిర్మాణం, కాలనీల ఏర్పాటు
– పోలీసు బలగాలతో గుడిసెల కూల్చివేత
– అయినా వెనక్కి తగ్గని పేదలు
– ‘జాగా వచ్చుడో.. మేం సచ్చుడో’ నినాదంతో పోరాటం
ఉమ్మడి జిల్లా గుడిసెల కేంద్రాలు ఎకరాలు గుడిసెలు
ఖమ్మం 7 29 3656
నల్లగొండ 13 50 830
వరంగల్‌ 19 179 18593
మహబుబ్‌నగర్‌ 3 424 950
మెదక్‌ 1 1.5 138
కరీంనగర్‌ 3 47 5000
నిజామాబాద్‌ 2 13 212
రంగారెడ్డి 1 100 18000
ఆదిలాబాద్‌ 1 7 1000

నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిది
కూడు, గూడు, గుడ్డ మనిషి కనీస అవసరాలు. కానీ రాష్ట్రంలో పేదల జీవితాలు గూడు లేని పక్షుల వలె చిన్నాభిన్నం అవుతున్నాయి. పల్లె విధ్వంసంతో పట్నాల బాట పట్టిన పేదలది మరీ దయనీయ స్థితి. గూడు లేక నానా అవస్థలు పడుతున్న పేదలు తమకు ఇంటి జాగాలు ఇవ్వాలని గతంలోనూ, ప్రస్తుతమూ ప్రభుత్వాలకు మొర పెట్టుకున్నారు. పెత్తందారులకు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులకు అండగా నిలిచిన పాలకులు పేదల సమస్యను పెడచెవిన పెట్టారు. దీంతో ఎర్రజెండా అండతో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నారు. ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపినా, పోలీసులను ఊసిగొల్పి బుల్‌ డోజర్లతో దాడి చేసినా.. కుట్రలు పన్ని స్థలాల నుంచి తరిమేందుకు దౌర్జన్యానికి పాల్పడుతున్నా పేదలు వెనక్కి తగ్గటంలేదు. ‘జాగా వచ్చుడో.. మేం సచ్చుడో’ అనే నినాదంతో పోరును మరింత తీవ్రతరం చేస్తున్నారు. ఎర్రజెండా అండతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గుడిసెల పోరాటంపై ప్రత్యేక కథనం.
ఇల్లు లేని నిరుపేదలు రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు జాగాల్లో గుడిసెలు వేసి పోరు సాగిస్తున్నారు. ఈ పోరులో రాష్ట్ర వ్యాప్తంగా 50 కేంద్రాలు 850 ఎకరాల్లో సుమారు 48 వేల కుటుంబాలు ఉన్నాయి. ఇంకా కొత్తగా ప్రభుత్వ జాగాల్లో గుడిసెలు వేసుకునేందుకు పేదలు సిద్ధమవుతున్నారు. వారికి అండగా సీపీఐ(ఎం), వ్యవసాయకార్మికసంఘం, ఇతర ప్రజాసంఘాలు అండగా నిలిచాయి. పోరాటంలో భాగస్వాములయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని అబ్దులాపూర్‌మెట్‌ రెవెన్యూ పరిధిలో సుమారు వంద ఎకరాల భూదాన్‌ భూముల్లో పేదలు 18 వేల గుడిసెలు వేశారు. ఇక్కడ సుమారు 30 వేల మంది నివాసం ఉంటున్నారు. వీరిని ఖాళీ చేయించేందుకు తాగునీరు అందకుండా ప్రభుత్వం నిర్బంధాలు ప్రయోగిస్తోంది. తాగునీరు ఇచ్చే వారిపై కేసులు పెడుతామని బెదిరింపులకు దిగుతోంది. అయినా ఇంటి జాగా సాధించే వరకూ పోరాడుతూనే ఉంటామని గుడిసెవాసులు ప్రతినబూనారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతంలో పేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారు. ఖరీదైన జాగా పేదలకు దక్కొద్దన్న దురుద్దేశంతో స్థానిక ప్రజాప్రతినిధుల అనుచురులు పలుమార్లు గుడిసెలపై దాడులు చేశారు. పోలీసు బలగాలతో గుడిసెలు తొలగించినప్పటికీ అక్కడ గుడిసెవాసులు పట్టు వీడలేదు. ప్రాణాలు పోయినా పర్వాలేదు.. ఇక్కడ నుంచి కదిలేది లేదని తెగేసి చెప్పారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా జక్కలొద్దిలో సర్కారు భూమిలో సుమారు పది వేల గుడిసెలు వేసి ఏకంగా ఆ ప్రాంతానికి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రగతినగర్‌ అని నామకరణం చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కకుర్తి, సంగారెడ్డి జిల్లా కంది, జగిత్యాల కోర్టు ప్రాంతం, చెన్నూరు, పెద్దపల్లి, రామగుండం, మహబూబాబాద్‌ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 50 కేంద్రాల్లో పేదలు గుడిసెలు వేసుకున్నారు. ఆ ప్రాంతాల్లోనూ నిత్యం పోలీసులు లాఠీలు ప్రయోగించినా రౌడీలు దౌర్జన్యాలకు పాల్పడినా పేదలు పోరాటం ఆపటం లేదు.
బతుకంతా వీధుల్లోనే ..
ఈ పోరాటంలో కడు పేదరికాన్ని అనుభవిస్తూ అర్థాకాలితో అలమటిస్తున్న అసంఘటిత కార్మిక కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. పట్టణాలకు వలస వచ్చిన కార్మికుల బతుకంతా వీధి గుడిసెల్లోనే కొనసాగుతోంది. ‘నా 70 ఏండ్ల జీవితంలో నేను చేసిన కష్టం పిల్లలను సాకడానికే సరిపోయింది. నాకు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు. నేను బొంతలు కుడితే వచ్చే ఆదాయంతో పిల్లలకు సరిగ్గా తిండిపెట్టలేని జీవితాన్ని గడిపాను. ఇలాంటి పరిస్థితిలో గూడు కట్టుకునే పరిస్థితి ఎక్కడిది. ఏ ప్రభుత్వం గుంటేడు జాగా ఇచ్చింది లేదు. ఇంటి అద్దె చెల్లించలేక గిప్పుడు ఎర్రజెండోల్లు పేదోల్లకు గుడిసెలు ఇవ్వాలని చేస్తున్న పోరాటంలో ఇక్కడ గుడిసె వేసుకున్నా. నాలుగు నెలలుగా ఈ గుడిసెల్లో ఉంటూ బొంతలు కుడుతూ జీవనం సాగిస్తున్నా. ప్రభుత్వం మా పేదోళ్ల గోస చూసైనా మా గుడిసె జాగాలకు పట్టాలు ఇవ్వాలి’ అని బక్కయ్య వేడుకుంటున్నాడు. ఇది కేవలం బక్కయ్య పరిస్థితే కాదు గుడిసెలు వేసుకున్న అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం తమపై దయ చూపి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని గుడిసెవాసులు కోరుతున్నారు.
పలుచోట్ల విజయాలు :
– హన్మకొండ జిల్లా ఎల్కకుర్తి మండలకేంద్రంలో వ్యకాస ఆధ్వర్యంలో ఎకరన్నర స్థలంలో 250 ఇండ్లు నిర్మించుకుని గృహ ప్రవేశం చేశారు. ఇక్కడ ప్రభుత్వంతో పోరాడి విద్యుత్‌ కలెక్షన్లు పొందారు.
– కామారెడ్డి జిల్లా జంగపల్లిలో వ్యకాస ఆధ్వర్యంలో 270 ఇండ్లు నిర్మించుకున్నారు.
– కొత్తగూడెంలో 28 ఎకరాల్లో 3,800 గుడిసెలు వేయగా ఇందులో కొందరు పక్కా ఇండ్లు నిర్మించుకున్నారు.
– వరంగల్‌ జక్కాలొద్దిలో ప్రగతినగర్‌ కాలనీ, లక్ష్మీనగర్‌ కాలనీలు ఏర్పడ్డాయి.
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి జాగాలు ఇవ్వాలి
రాష్ట్రంలో కనీసం తలదాచుకోవడానికి గూడు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇంటి జాగాలు ఇవ్వాలి. ఇంటి నిర్మాణాలకు రూ.5 లక్షలు ఇవ్వాలి. కేంద్రప్రభుత్వం పదిలక్షలు ఇవ్వాలి. గతంలో పట్టాలు ఇచ్చి జాగాలు చూపని వారికి కూడా జాగాలు చూపించాలి. రాష్ట్ర వ్యాప్తంగా గూడిసెల పోరాటం చేస్తున్న వారిలో వంద శాతం నిరుపేదలు ఉన్నారు. ప్రభుత్వం వారి దీనస్థితిని అర్థం చేసుకుని అర్హులైన వారందరికీ ఇంటి జాగాలు ఇవ్వాలి.
– బుర్రి ప్రసాద్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు