హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి

– రూ.330 కోట్లతో బయో మ్యానుఫ్యాక్చరింగ్‌ తయారీ యూనిట్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. రూ.330 కోట్లతో ప్రపంచ స్థాయి బయో మ్యానుఫ్యాక్చరింగ్‌ తయారీ యూనిట్‌ని ఏర్పాటు చేయాలని ఆరిజిన్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ నిర్ణయించింది. హైదరాబాద్‌ లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో మరో భారీ
హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి చేరింది. తాజాగా ఆరిజిన్‌ ఫార్మాస్యూటికల్‌ సర్వీసెస్‌ సంస్థ సుమారు 330 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రపంచ స్థాయి తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌ నగరంలో ఉన్న జినోమ్‌ వ్యాలీలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఫార్మా దిగ్గజ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీ సబ్సిడరీ సంస్థ అయిన ఆరిజిన్‌ ఫార్మాస్యూటికల్‌ ఈ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నది. డాక్టర్‌ రెడ్డీస్‌ చైర్మెన్‌ సతీష్‌రెడ్డి, ఆరిజిన్‌ ఫార్మాస్యూటికల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సీఈవో అఖిల్‌ రవిలు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిసి ఈ మేరకు తమ సంస్థ నిర్ణయాన్ని మంగళవారం ప్రకటించారు. మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశం సందర్భంగా తమ ఆరిజిన్‌ ఫార్మాస్యూటికల్‌ సర్వీసెస్‌ భవిష్యత్తు ప్రణాళికలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాము హైదరాబాద్‌ నగరంలో పెడుతున్న ఈ పెట్టుబడి ద్వారా సుమారు 200 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని, మరో 60 నుంచి 70 మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు వస్తాయని, ఇవన్నీ కూడా లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఉన్నత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలని మంత్రి కేటీఆర్‌కి వివరించారు. భవిష్యత్తులో తమ పెట్టుబడిని మరింతగా పెంచే ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలిపారు. తాము ఏర్పాటు చేస్తున్న ఈ సంస్థ ద్వారా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన బయోటెక్‌ ఇన్నోవేటర్ల భాగసామ్యంతో వారి ఆలోచనలకు, పరిశోధనలకు ఊతం ఇచ్చేలా పనిచేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వీరి నైపుణ్యం వలన ప్రపంచ స్థాయి బయోటెక్‌ ఉత్పత్తులను తయారు చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఆరిజిన్‌ ఫార్మాస్యూటికల్‌ భారీ ఎత్తున హైదరాబాద్‌ నగరంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. బయోటెక్‌ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా సంస్థ విస్తరణ ప్రణాళికలు ఉన్నాయన్నారు. ఆరిజిన్‌ ఫార్మాస్యూటికల్‌ విస్తరణ ప్రణాళికలు, పెట్టుబడి బయో ఫార్మాస్యూటికల్‌ రంగంలో హైదరాబాద్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నగరాన్ని ఫార్మాస్యూటికల్‌, బయోటెక్నాలజీ కేంద్రంగా తయారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కషికి ఆరిజిన్‌ ఫార్మాస్యూటికల్‌ సంస్థ సీఈవో అఖిల్‌ రవి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న మౌలిక వసతులు, మానవ వనరుల వల్లనే తాము ఈ పెట్టుబడిని హైదరాబాద్‌లో పెడుతున్నట్టు తెలిపారు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్న తాము, బయోటెక్నాలజీ రంగంలో మందుల తయారీ, పరిశోధన, అభివద్ధి ప్రధాన అంశాలుగా తమ సంస్థ పనిచేస్తుందని తెలిపారు. హైదరాబాద్‌ కేంద్రంగా ప్రపంచ స్థాయి బయో టెక్నాలజీ ఉత్పత్తులను తయారు చేస్తామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు

Spread the love