మూడు వారాలపాటు ప్రజలతో మమేకమవుదాం..

పల్లె నుంచి పట్నం దాకా దశాబ్ది ఉత్సవాలు…
ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో జూన్‌ 2 నుంచి మూడు వారాలపాటు వివిధ రూపాల్లో ప్రజలతో మమేకం కావాలని సీఎం కేసీఆర్‌ ప్రజా ప్రతినిధులకు, అధికారులకు పిలుపునిచ్చారు. ప్రారంభ వేడుకలను రాష్ట్ర సచివాలయంలో ఘనంగా నిర్వహించాలనీ, సంబంధిత ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, కార్యాచరణ, సంబంధిత అంశాలపై శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదేండ్ల రాష్ట్ర ప్రగతిని చాటుతూ పల్లె నుంచి పట్నం దాకా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఒకనాడు అనేక అవమానాలకు, అపోహలకు గురైన తెలంగాణ నేడు అద్భుతంగా వెలుగొందుతున్నదని తెలిపారు. అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని వివరించారు. ఈ క్రమంలో వ్యవసాయం, సంక్షేమం, సాగు, తాగునీరు, విద్య, వైద్యంతోపాటు ప్రతీ రంగంలో సాధించిన అభివృద్ధిని ప్రసార మాధ్యమాల ద్వారా జనానికి చేరవేయాలని ఆదేశించారు.
ఆటపాటల ద్వారా పండుగ వాతావరణంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ప్రారంభ వేడుకల కోసం సచివాలయంలో స్టేజీ ఏర్పాటు, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరణ, జాతీయ జెండాను ఎగరేయటం, పార్కింగ్‌ సౌకర్యం, అతిథులకు తేనీటి విందు తదితరాంశాలపై ఆయన ఉన్నతాధికారులతో చర్చించారు. వారికి పలు ఆదేశాలను జారీ చేశారు. సమీక్షా సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love