సీట్ల సంగతి సరే.. ముందు ఓట్లు ముఖ్యం…

Seats are okay.. First votes are important..– అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన శాతాన్ని కాపాడుకోవాలి
– ‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ ప్రణాళిక ఇదే
– అప్పుడే ప్రజల్లో పార్టీకి ఆదరణంటూ అంచనా
– ఓటు బ్యాంకు కాపాడుకోవటంపై గులాబీ బాస్‌ దిశా నిర్దేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు సీట్ల కంటే ఓట్ల శాతమే ముఖ్యమంటోందా..? దాన్ని కాపాడుకోవటంపైన్నే దృష్టి సారించిందా..? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. గత డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక్కో శాసనసభా నియోజకవర్గం వారీగా వచ్చిన ఓట్లను ఇప్పుడు కూడా సాధిస్తే అదే పదివేలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఆ ఓట్ల శాతాన్ని కాపాడుకోవటం ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు పెద్ద సవాల్‌గా మారింది. అందుకోసం అధినేత కేసీఆర్‌తోపాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
గత లోక్‌సభ (2019) ఎన్నికల సమయంలో అధికార పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్‌… రాష్ట్రంలోని 17 స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఆ ఎన్నికల్లో బీజేపీ నాలుగు, కాంగ్రెస్‌ మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న కారు పార్టీకి ఈ ఎన్నికలు కత్తిమీద సాములాగా తయారయ్యాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 64 స్థానాల్లో గెలుపొంది, 39.40 శాతం ఓట్లను సాధించింది. ఆ పార్టీకి అన్ని అసెంబ్లీ స్థానాల్లో కలిపి 92,35,833 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ మొత్తం 39 స్థానాల్లో విజయం సాధించి 37.35 శాతం ((87,53,956 ఓట్లు) ఓట్లతో సరిపెట్టుకుంది. అంటే ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 1.85 శాతంగా ఉందన్నమాట.
ఇక 2019 లోక్‌సభ ఎన్నికల తీరును పరిశీలిస్తే… ఆ ఎలక్షన్లలో మొత్తం 9 ఎంపీ సీట్లను గెలుచుకున్న కారు పార్టీ, 41.71 శాతం (76,96,848) ఓట్లను సాధించింది. మూడు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ 29.79 శాతం (54,96,686) ఓట్లను సాధించింది. ఇక నాలుగు సీట్లలో గెలిచిన బీజేపీ 19.65 శాతం ఓట్ల(36,26,173)తో మూడో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే, మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లలో ఓట్ల శాతం తగ్గిందనీ, నాలుగు శాతం మేర తగ్గిన ఆ శాతమే తన ఓటమికి కారణమైందని బీఆర్‌ఎస్‌ గుర్తించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్‌లోకి వలసలు, ఫలితంగా క్షేత్రస్థాయిలో అననుకూల పరిస్థితులు తదితర కారణాల రీత్యా సీట్లతోపాటు ఓటు బ్యాంకును నిలుపుకోవటంపై దృష్టి సారించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ భావిస్తున్నారు. అందుకనుగుణంగా ప్రతీ లోక్‌సభ నియోజకవర్గంలోనూ కార్యాచరణ చేపట్టి, అమలు చేయాలంటూ ఆయన నేతలు, అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. అయితే అధికారంలో ఉన్నప్పుడే 9 సీట్లకే పరిమితమైన గులాబీ పార్టీ… ఇప్పుడు అధికారం కోల్పోయిన వేళ, మునుపటి ప్రభ తగ్గిన ప్రస్తుత తరుణంలో ఎన్ని సీట్లు సాధిస్తుంది..? ఎంత శాతం మేర ఓటు బ్యాంకును కాపాడుకుంటుంది…? అనేది వేచి చూడాలి.

Spread the love