ఆగం కావొద్దు..

– కాంగ్రెస్‌ వస్తే.. దళారీలదే రాజ్యం
– పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వంద శాతం పూర్తి చేస్తాం
– తెలంగాణ ప్రజలే నా బలగం.. బంధువులు..: నాగర్‌కర్నూల్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి/కందనూలు
    తొమ్మిదేండ్ల తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని, ఇదే స్ఫూర్తితో చిరునవ్వులు చిందించే తెలంగాణ కోసం ముందుకు వెళదామని, రైతులు ఆగమాగం కావొద్దని, మోసపోతే గోసపడతామని, కాంగ్రెస్‌ వస్తే దళారీలదే రాజ్యం ఉంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 100 శాతం పూర్తి చేస్తామని తెలిపారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో రూ.62 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అలాగే, రూ.38.5 కోట్లతో నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయాన్నీ ప్రారంభించారు. ఉయ్యాలవాడ సమీపంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.166 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాగర్‌ కర్నూల్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో కేసీఆర్‌ మాట్లాడారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఒక ప్రబుద్ధుడు అంటున్నారని,ధరణిని బంగాళాఖాతంలో వేస్తే మళ్లీ లంచాల రాజ్యం వస్తుందని వ్యాఖ్యానించారు. ధరణి ఉండాలా? వద్దా? అనేది మీరే చెప్పాలని కోరగా.. అక్కడున్న వారు ఉండాలని చెతులెత్తారు.. ధరణి వల్ల 99శాతం సమస్యలు పరిష్కారం అయ్యాయని, మిగిలిన ఒక్క శాతాన్ని అధికారులు పరిష్కారం చేస్తారని తెలిపారు. రైతులను పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పేలా కాంగ్రెస్‌ పార్టీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. గతంలో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌లో ఎటు చూసినా ఎండిపోయిన చెరువులు, వాగులు, వంకలు కనపడేవని, ఇప్పుడు హెలికాప్టర్‌లో నాగర్‌ కర్నూల్‌ వస్తుంటే చెక్‌ డ్యాం, చెరువుల్లో నీరు కనపడుతుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. గతంలో అడవులు కూడా పలుచబడిపోయిన సంఘటనలు ఉన్నాయని, ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గంలోనే 75 నుంచి లక్ష ఎకరాల వరకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఇంతటి అభివృద్ధి సాధించడానికి ఉమ్మడి జిల్లా ప్రజలే కారణమన్నారు. రాష్ట్రంలో తాగు, సాగు నీరు, విద్యుత్తు సమస్యలు తీరిపోయాయని, తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. ఐటీ రంగంలో దేశంలో 2 ఉద్యోగాలు వస్తే అందులో ఒకటి కచ్చితంగా తెలంగాణలో దొరుకుతున్నదని, 50శాతం ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్‌ సిటీ నుంచి వస్తున్నాయన్నారు. తొమ్మిదేండ్లు పూర్తయి పదో సంవత్సరంలో అడుగిడుతున్న తెలంగాణ.. రెండేండ్లు కరోనాతో అతలాకుతులం కాగా, కేవలం ఆరున్నర, ఏడేండ్లలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి సాధించిందని తెలిపారు. దేశంలో ఏ పల్లెలు.. తెలంగాణ పల్లెలకు సాటి రావన్నారు. ఇటీవల ఊరురా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద పథకమన్నారు. అలాగే మిషన్‌ కాకతీయ, భగీరథ వంటి అద్భుత పథకాలను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామని తెలిపారు. ఇంతటి అభివృద్ధికి రాష్ట్ర ప్రజలతో పాటు ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల కష్టపడే పనితత్వం వల్లనే సాధ్యమయిందంటూ వారిని అభినందించారు. తెలంగాణ ప్రజలే తన బలగం.. తన బంధువులని.. ఆధైర్యంతోనే అనేక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.
అంతకు ముందు అధికారులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి మాట్లాడుతూ.. పరిపాలనను ప్రజలకు చేరువుగా తీసుకువచ్చేందుకు రాష్ట్రంలో రూ.1649 కోట్లతో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనాలను నిర్మించినట్టు తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాతో కలిపి మొత్తం 19 జిల్లాల్లో కార్యాలయాలు ప్రారంభమయ్యాయన్నారు. సంపద సృష్టి పంపిణీలో తెలంగాణ రాష్ట్రం రికార్డు సాధించిందని, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఉద్యోగుల తరఫున ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, ప్రశాంత్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, డీజీపీ అంజనికుమార్‌, ఎంపీ రాములు, మన్నే శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజ్‌, ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, కూచుకుల్లా దామోదర్‌ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌ రెడ్డి, డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి, జైపాల్‌ యాదవ్‌, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, హర్షవర్ధన్‌ రెడ్డి, రాజేందర్‌ రెడ్డి, చిట్టెం రామ్‌ మోహన్‌ రెడ్డి, అబ్రహం, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన ఆర్‌ అండ్‌ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి
రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఐ.గణపతిరెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్‌లోని కొత్త సచివాలయంతోపాటు రాష్ట్రం లోని అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ఇతర భవనాల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న గణపతిరెడ్డికి నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అవకాశం ఇచ్చారు. సీఎంకు దన్యవాదాలు తెలిపిన గణపతిరెడ్డి, కలెక్టరేట్‌ భవనం రిబ్బన్‌ కట్‌ చేశారు. ఆయన పక్కనే రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు సీఎస్‌ శాంతికుమారి కూడా ఉండటం గమనార్హం. తనకు భవనాన్ని ప్రారంభించే అవకాశం ఇవ్వడం పట్ల గణపతిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Spread the love