– చిలకలగూడ హత్య కేసును ఛేదించిన పోలీసులు
– ప్రెస్‌మీట్‌లో వివరాలు వెల్లడించిన డీసీపీ రక్షిత కృష్ణమూర్తి
నవతెలంగాణ- అంబర్‌పేట/ఉస్మానియా యూనివర్సిటీ
ప్రేమ వ్యవహారం నేపథ్యంలో హైదరాబాద్ చిలకలగూడలో బీటెక్ విద్యార్థిపై పక్కా ప్రణాళికతో కత్తులతో దాడి చేసి హత్య చేసిన ఘటనలో మైనర్ సహా 10 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసు వివరాలు వెల్లడించారు.
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిబావి, ఇందిరానగర్ కాలనీలో ఈనెల 7న బొమ్మన యవన్ అలియాస్ అఖిల్(21) అనే బీటెక్ విద్యార్థి హత్య జరిగిన విషయం తెలిసిందే. మృతుడు ఒక యువతితో ప్రేమలో ఉండగా, అదే యువతిని వివాహం చేసుకోవాలని భావించిన అల్లబోయిన సాయి కిరణ్ అలియాస్ సాయి అతనిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో రాజం పరమేష్ కుమార్ యాదవ్ అలియాస్ డాన్, రాజం వంశీ కృష్ణ అలియాస్ రాఖీ, రాజం మనీష్ అలియాస్ బిచ్చు, శ్రీగిరి రాహుల్, కుచుల శివ నందన్ యాదవ్, రాజం నరసింహ యాదవ్, రాజం శ్రీశైలం యాదవ్, రాజం మల్లేష్ యాదవ్ అలియాస్ మల్లన్నతో కలిసి యవన్‌ను హత్య చేయాలని కుట్ర పన్నారు. ఒక బాలుడు కూడా ఈ ఘటనలో పాల్గొన్నట్టు డీసీపీ తెలిపారు. హత్యకు నాలుగు నుంచి ఐదు రోజుల ముందే నిందితులు మేడిబావి ప్రాంతంలో సమావేశమై పూర్తి స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. మే 7న రాత్రి సుమారు 8:45 గంటల సమయంలో యవన్‌ను అడ్డగించి కత్తులతో మెడ, ఛాతి ఇతర కీలక శరీర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్, సెల్‌ఫోన్ కాల్ డేటా, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తులు, ఎలక్ట్రిక్ స్కూటర్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ కేసును అడిషనల్ డీసీపీ నరసయ్య ఆధ్వర్యంలో, చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ, ఎస్‌ఐలు, ప్రత్యేక పోలీసు బృందాలు వేగంగా ఛేదించినట్టు డీసీపీ తెలిపారు. ”ప్రేమ వ్యవహారాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతాం” అని డీసీపీ హెచ్చరించారు.
యవన్ హత్య కేసులో 10 మంది అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



