దేశంలో మార్పులు తెచ్చేది కమ్యూనిస్టులే
రాష్ట్రంలో తగ్గిన జీవన ప్రమాణాలు
లోపభూయిష్టంగా మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు
రానున్న నాలుగేండ్లలో మొత్తం ప్రయివేటు ఆస్పత్రులు, వైద్యులే
‘ప్రజా ఆరోగ్యం – ప్రభుత్వాల బాధ్యత’
సదస్సులో ఎయిమ్స్ డాక్టర్ విజయ్ కుమార్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఒక దేశం అభివృద్ధికి సూచిక ప్రజారోగ్యం, విద్యనే అని ఎయిమ్స్ డాక్టర్ విజయ్ కుమార్ అన్నారు. భారతదేశంలో ఈ రెండింటికీ ప్రాధాన్యత ఇవ్వటం లేదనీ, ఈ దేశంలో మార్పులు తెచ్చేది కమ్యూనిస్టులేనని తెలిపారు. తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలు తగ్గాయని చెప్పారు. సీపీఐ(ఎం) మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ‘ప్రజా ఆరోగ్యం – ప్రభుత్వాల బాధ్యత’ అనే అంశంపై డాక్టర్ ఏఎస్ రావు నగర్ సీనియర్ సిటిజన్ హాల్‌లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె.చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. కోవిడ్ సమయంలో మరణాలకు ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడమే కారణమని అన్నారు. అమెరికాలో కోవిడ్ సమయంలో వెంటిలేటర్స్ లేకపోవటంతో చాలా మంది చనిపోయారనీ, ప్రభుత్వం వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే దీనికి కారణమని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదన్నారు. ఇటలీలో కోవిడ్ సమయంలో అక్కడి ఆస్పత్రుల్లో వైద్యులు సరిపడా లేకపోవడంతో క్యూబా నుంచి వచ్చిన వైద్యులు వైద్యం చేశారని గుర్తు చేశారు. వైద్యం విషయంలో సోషలిస్టు దేశాలు ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందున్నాయని తెలిపారు. మొదట్లో రాష్ట్రంలో మూడు ఆస్పత్రులు మాత్రమే ఉండేవనీ, ఇప్పుడు చాలా వచ్చాయనన్నారు.
ఇప్పుడున్న మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు చాలా వరకు లోపభూయిష్టంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి 10వేల మంది వైద్యులు తయారవుతున్నారని చెప్పారు. పీజీ చదివే వైద్యులు రూ.కోటికి పైగా డొనేషన్ ఇచ్చి జాయినవుతున్నారని చెప్పారు. రానున్న నాలుగైదేండ్లలో పూర్తిగా ప్రయివేటు ఆస్పత్రులు, వైద్యులే ఉంటారని తెలిపారు. ఎక్కువ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినంత మాత్రాన అభివృద్ధి అనుకోలేమని అన్నారు. వంద మంది గర్భిణుల్లో 60-70 మందికి సిజేరియన్ చేస్తున్నారని ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రభుత్వాలు వైద్యులకు సరైన శిక్షణ ఇవ్వకపోవడంతో వారికి జబ్బుల గురించి సరైన అవగాహన లేకుండా పోతోందని తెలిపారు. ఏ సమస్యపై కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లినా రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. అనేక కారణాల వల్ల లెఫ్ట్ పార్టీలు వెనుకపడ్డాయని, మనం కూడా అధ్యయనం చేయాలనీ, నేర్చుకోవాలని సూచించారు.
విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి : పాలడుగు భాస్కర్
భారత రాజ్యాంగం ప్రకారం విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ అన్నారు. ఈ రెండింటినీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. వైద్యం మొత్తం ప్రభుత్వ రంగంలో ఉండాలని వైద్యం వ్యాపారంగా మారకూడదన్నారు. ఏ పార్టీల పాలకవర్గాల విధానాలైనా ఒకటే అనీ, ఇప్పుడున్న పాలకులు వైద్యాన్ని కూడా మూఢనమ్మకాల వైపు తీసుకెళ్తున్నారనీ, ఆవు మూత్రం తాగితే అన్ని రోగాలు పోతాయని ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి సంపాదనలో 70శాతం వైద్యానికే ఖర్చు అవుతుందనీ, ఈ విషయంలో కేరళ మినహా అన్ని రాష్ట్రాలు చాలా బలహీనంగా ఉన్నాయని చెప్పారు. సీపీఐ(ఎం) మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, నీళ్లు, విద్య విషయాల్లో ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటే ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వైద్యంలో అన్ని రకాల సౌకర్యాలు, ఆస్పత్రుల సంఖ్య పెంచాలనీ, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి, జి.శ్రీనివాసులు, ఎం.వినోద, ఎర్ర అశోక్, జిల్లా కమిటీ సభ్యులు ఎన్. శ్రీనివాస్, ఆర్.సంతోష్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


