Monday, August 3, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువిద్యుత్‌ ఆర్థిక సంస్థల విలీనం!

విద్యుత్‌ ఆర్థిక సంస్థల విలీనం!

- Advertisement -

పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీని కలిపేసే యోచన
2027 ఏప్రిల్‌ 1 లక్ష్యంగా కదులుతున్న పావులు
కీలక సమయంలో కేంద్ర ప్రభుత్వ మరో అనాలోచిత నిర్ణయం..రాష్ట్రాలకు తీవ్ర 
ఆర్థిక నష్టం..పునరుత్పాదక ఇంధనంపై ప్రభావం

ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి
దేశంలో 2030 నాటికి నాన్‌-ఫాసిల్‌ (బగ్గు, చమురు, గ్యాస్‌) విద్యుదుత్పత్తి ని 50 శాతం తగ్గించి, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించాలనేది కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం. ఇదే విషయాన్ని స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాప్‌-26 వాతావరణ సదస్సులో స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల 2030 నాటికి దేశంలో 1 బిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలనేది లక్ష్యం. ఈ విషయాన్ని కూడా స్వయంగా ప్రధాని అదే సదస్సులో ప్రటించారు. అంటే ప్రస్తుతం దేశ విద్యుత్‌ అవసరాలు తీరుస్తున్న బగ్గు, చమురు, గ్యాస్‌ ఆధారిత విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించాలి. అదే సమయంలో పునరుత్పాదక ఇంథనం అయిన సౌర, పవన, జల, బయోమాస్‌, బయోగ్యాస్‌, భూ ఉష్ణ, సముద్రశక్తి ద్వారా విద్యుదుత్పత్తిని పెంచాలి. ఈ తరహా విద్యుత్‌ ప్లాంట్లను ప్రోత్సహించాలి. ఇక్కడి వరకు వినడానికి చాలా గొప్ప నిర్ణయంగా కనిపిస్తుంది. పర్యావరణం పట్ల మోడీ సర్కారుకు ఉన్న నిబద్ధతను కొనియాడాలనిపిస్తుంది.

ఇదీ గూడుపుఠాణీ
అసలు గూడుపుఠాణీ ఇక్కడి నుంచే మొదలైంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దానికోసం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థలైన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) ద్వారా రాష్ట్రాలకు రుణాలు ఇస్తామని ప్రకటించింది. ఆ మేరకే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పునరుత్పాదక ఇంధన ప్రణాళికలు రూపొందించుకున్నాయి.

తెలంగాణలో…
తెలంగాణ ప్రభుత్వం కూడా ‘తెలంగాణ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ-2025’ రూపొందించింది. 2030 నాటికి 20వేల మెగావాట్లను సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజ్‌, బ్యాటరీ స్టోరేజ్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ ద్వారా ఉత్పత్తి చేయాలని నిర్దేశించుకుంది.

కేంద్రం ట్విస్ట్‌
ఇక్కడే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ట్విస్ట్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ ద్వారా రాష్ట్రాల్లో విద్యుత్‌రంగంలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల ఏర్పాటు కోసం వేర్వేరుగా రుణాలు ఇస్తున్నాయి. అప్పులు ఇచ్చేందుకు రెండు ఆర్థిక సంస్థలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీల విషయంలో బేరం ఆడి (బార్గెయినింగ్‌), ఎవరు తక్కువ వడ్డీకి రుణం ఇస్తే, వారి నుంచే అప్పులు తీసుకొనేవారు. ఇప్పుడు దీనికి గండి కొడుతూ కేంద్రప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటున్నది. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీని విలీనం చేసి ఒకే ఆర్థిక సంస్థగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రాధమిక చర్చలు ఇప్పటికే పూర్తయినట్టు సమాచారం.

డెడ్‌లైన్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1
2027 ఏప్రిల్‌ 1 నాటికి ఈ విలీన ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ విలీనంతో ఈ రెండు సంస్థల ద్వారా దాదాపు రూ.11 లక్షల కోట్ల రుణాలు (లోన్‌బుక్‌ పరిమాణం) ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, విద్యుత్‌ సంస్థలకు ఇచ్చినట్టు అవుతుంది. రాష్ట్రాలు తప్పనిసరై పునరుత్పాదకం వైపు వెళ్లాలి కాబట్టి వడ్డీల విషయంలో బేరం అదే అవకాశం లేకుండా ఒకే సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రాలపై ఆర్థికభారాలు తీవ్రంగా పెరుగుతాయి.

రాష్ట్రంపై ఆర్థికభారం
తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ సంస్థల నుంచి దాదాపు రూ. రెండు లక్షల కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. స్వల్ప, దీర్ఘకాలిక వాయిదాల్లో తీసుకున్న ఈ రుణాలకు వడ్డీలు 9.5 శాతం నుంచి 13 శాతం వరకు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి విద్యుత్‌రంగంపై సమీక్ష సందర్భంగా వడ్డీల భారాన్ని తీవ్రంగా పరిగణించారు. అప్పటి వరకు అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలను రీషెడ్యూల్‌ చేయాలనీ, వడ్డీ రేట్లు తగ్గించాలని పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీని కోరారు. పలు సంప్రదింపుల అనంతరం ఆ రెండు సంస్థలు రుణాల వడ్డీలను 8.86 శాతం నుంచి 10.59 శాతానికి తగ్గించాయి. ఎక్కువ రుణాలపై వడ్డీలు 9.93 శాతానికి తగ్గాయి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వేలకోట్ల ఆర్థికభారం తప్పింది. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రెండు సంస్థలు వేర్వేరుగా ఉండటంతో బార్గెయినింగ్‌ ద్వారా వడ్డీ రేట్లను తగ్గించుకున్నట్టు స్వయంగా సీఎం ఏ రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు.

బార్గెయినింగ్‌ ఉండదు
పునరుత్పాదకం వైపు రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లుతున్న సమయంలో రెండు ఆర్థిక సంస్థలను విలీనం చేసి, ఒకటిగా ఏర్పాటు చేయడం వల్ల ఈ ‘బార్గెయినింగ్‌’ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోతాయని విద్యుత్‌రంగ నిపుణులు చెప్తున్నారు.

గ్రామీణంలో చీకట్లు
అదే సమయంలో గ్రామీణ విద్యుదీకరణ, పట్టణ విద్యుదీకరణకు రుణాలు ఇచ్చేందుకు రెండు రుణ సంస్థలు వేర్వేరుగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఒక్కటిగా ఏర్పాటు చేస్తే, గ్రామీణంలో మళ్లీ చీకట్లు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు తీసుకున్నా, ఏటా ఆయా రుణాలను దేనికోసం వినియోగిస్తున్నారో తెలుపుతూ ‘యుటిలిటీ సర్టిఫికెట్లు’ సమర్పించాల్సి ఉంటుంది. దీనివల్ల నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదు. పునరుత్పాదక ఇంధనం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు సంస్థలతో అనేక ఒప్పందాలు చేసుకున్నాయి. వాటిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కసరత్తు జరుగుతున్న సమయంలో పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ విలీన నిర్ణయం రాష్ట్రాలపై ఆర్థికభారాల్నే మిగులుస్తుందనడంలో సందేహం లేదు!

ఇవీ నష్టాలు

విలీన ప్రక్రియ ఇలా…
ఇప్పటికే తొలి దశలో పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ డైరెక్టర్ల సమావేశం జరిగినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో దీనికి బోర్డుల ఆమోదం తెలపాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే ఈ విలీనానికి ఆయా సంస్థల వాటాదారులు (షర్‌ హోల్డర్స్‌), రుణదాతలు, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ), నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదాలు లభించాల్సి ఉంటుంది. ఈ పక్రియ మొత్తం 2027 ఏప్రిల్‌ 1 నాటికి పూర్తిచేసి ఒకే సంస్థగా అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమా చారం. ఆ మేరకు సంప్రదింపులు ప్రారంభమైనట్టు తెలిసింది.

పోటీ తగ్గిపోవడం
ప్రస్తుతం పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రెండూ విద్యుత్‌ రంగ ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వడంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. దీంతో రుణాల వడ్డీ, షరతుల్లో కొంత పోటీ ఉంటుంది. విలీనం తర్వాత ఒకే పెద్ద సంస్థగా మారితే ఆ పోటీ తగ్గే అవకాశం ఉంది.

రిస్క్‌ కేంద్రీకరణ
విలీన సంస్థ రుణాల పరిమాణం రూ.11 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఈ భారీ రుణాల్లో ఎక్కువ భాగం విద్యుత్‌ రంగానికే పరిమితం కావడంతో, ఆ రంగంలో సంక్షోభం ఏర్పడితే మొత్తం సంస్థపై ప్రభావం ఎక్కువగా పడే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా స్వతంత్రతను కోల్పోయి, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆదుపాజ్ఞల్లో పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

కొత్త ఉద్యోగాల్లేవ్‌
విలీన ప్రక్రియ పూర్తయితే ఆయా సంస్థల్లోని అన్ని విభాగాల ఉద్యోగులపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శాఖల ఏకీకరణ, బదిలీలు, బాధ్యతల మార్పు వంటి అంశాలు ఉద్యోగుల్లో అనిశ్చితి కలిగిస్తాయి. దానికి తోడు ఉద్యోగాల కోత, కొత్త ఉద్యోగాల సృష్టిని కోల్పోవాల్సి ఉంటుంది.

ప్రాంతీయ దృష్టి తగ్గుదల
ఆర్‌ఈసీ గ్రామీణ విద్యుదీకరణ, పంపిణీ సంస్థలకు (డిస్కంలు) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే, పీఎఫ్‌సీ పెద్ద విద్యుత్‌ ఉత్పత్తి, ప్రసార ప్రాజెక్టులకు ఎక్కువ రుణాలు అందిస్తోంది. విలీనం తర్వాత చిన్న లేదా ప్రత్యేక రంగాలపై దఅష్టి తగ్గుతుందని విద్యుత్‌రంగ నిపుణులు భావిస్తున్నారు. రుణాల ఆమోద ప్రక్రియ కేంద్రీకఅతం అయ్యి, రుణాల షరతులపై చర్చించే అవకాశాలు తగ్గిపోతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -