Sunday, September 13, 2026
E-PAPER
Homeజాతీయంబుధుడు మరింతగా కుంచించుకుపోయాడా?

బుధుడు మరింతగా కుంచించుకుపోయాడా?

- Advertisement -

గత అంచనాల కంటే 30 శాతం అధికంగా సంకోచం
శాస్త్రవేత్తల తాజా అధ్యయనం వెల్లడి 23 కిలోమీటర్ల వరకు తగ్గి ఉండొచ్చని అంచనా

సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహమైన బుధుడు గతంలో భావించిన దానికంటే మరింతగా కుంచించుకుపోయి ఉండొచ్చని తాజా శాస్త్రీయ అధ్యయనం వెల్లడించింది. గ్రహం లోపలి భాగం క్రమంగా చల్లబడటం వల్ల ఏర్పడిన సంకోచానికి సంబంధించిన అనేక భౌగోళిక ఆనవాళ్లు ఉల్కాపాతం వల్ల ఏర్పడిన భారీ శిథిలాల కింద దాగిపోయి ఉండవచ్చని పరిశోధకులు గుర్తించారు. దీంతో బుధుడి వ్యాసం ఇప్పటివరకు అంచనా వేసిన దానికంటే 30 శాతం ఎక్కువగా, గరిష్ఠంగా 23 కిలోమీటర్ల వరకు తగ్గి ఉండొచ్చని వారు చెప్తున్నారు.

న్యూఢిల్లీ : సౌర కుటుంబంలోని అతి చిన్న, సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్న బుధ గ్రహం అది ఏర్పాటైన నాటి నుంచి క్రమంగా కుంచించుకుపోతూనే ఉందని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. అయితే ఈ సంకోచం గత అంచనాల కంటే మరింత ఎక్కువగా ఉండొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. బుధుడి వ్యాసం ఏకంగా 23 కిలోమీటర్ల వరకు తగ్గి ఉండొచ్చనీ, ఇది గత లెక్కల కంటే సుమారు 30 శాతం అధికమని పరిశోధకులు తెలిపారు.జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయనం బుధుడి ఉపరితలంపై ఉన్న సంకోచ ఆనవాళ్లను కొత్త కోణంలో పరిశీలించింది. సుమారు 4,900 కిలోమీటర్ల వ్యాసం మాత్రమే ఉన్న బుధ గ్రహానికి 23 కిలోమీటర్ల సంకోచం కూడా గణనీయమైన మార్పేనని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
బుధ గ్రహం సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. అప్పటి నుంచి దాని లోపల ఉన్న భారీ, వేడిగా ఉండే ఇనుప కేంద్రకం క్రమంగా చల్లబడుతోంది. వేడి తగ్గడంతో కేంద్రకం సంకోచించగా, దాని ప్రభావం గ్రహంలోని మాంటిల్, ఉపరితల పొరలపై పడుతోంది. దీంతో బుధుడి బయటి పొరలు బిగుసుకుపోయి, ఉపరితలంపై ముడతలు, పగుళ్లు, ఇతర భౌగోళిక నిర్మాణాలు ఏర్పడుతున్నాయి.

అయితే బుధుడి ఉపరితలం అత్యంత గరుకుగా, అనేక భారీ గుంతలతో నిండి ఉండటం వల్ల ఈ సంకోచానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు స్పష్టంగా కనిపించకుండా పోయాయని తాజా పరిశోధన వివరిస్తోంది. ముఖ్యంగా గ్రహశక లాలు, ఇతర ఖగోళ వస్తువులు ఢీకొనడంతో ఏర్పడిన పెద్ద గుంతల నుంచి ఎగిసిపడిన శిథిలాలు కొన్ని ప్రాంతాలను కప్పివేసి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన గాకు నిషియామా బృందం బుధుడిపై ఉన్న పగుళ్లు, సంకోచానికి సంబంధించిన ఇతర భౌగోళిక నిర్మాణాల మ్యాప్‌లను తాజా ఉపరితల గరుకుదనం మ్యాప్‌లతో పోల్చింది. అత్యంత గరుకుగా ఉన్న ప్రాంతాల్లో సంకోచం వల్ల ఏర్పడిన ముడతలు, ఇతర నిర్మాణాలు తక్కువగా కనిపించాయని వారు గుర్తించారు. దీంతో అక్కడ సంకోచ ఆనవాళ్లు అసలు లేవని కాకుండా, పెద్ద గుంతల నుంచి వచ్చిన శిథిలాల కింద అవి దాగిపోయి ఉండవచ్చనే నిర్ధారణకు వచ్చారు. ఈ దాగిపోయిన ప్రాంతాలను కూడా లెక్కలోకి తీసుకున్న తర్వాత బుధుడు ఇప్పటివరకు భావించిన దానికంటే ఎక్కువగా కుంచించుకుపోయి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు.

ఈ పరిశోధన ప్రాధాన్యం మరింత పెరగడానికి మరో కారణం కూడా ఉంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా చేపట్టిన బెపికొలంబో అంతరిక్ష మిషన్ త్వరలో బుధుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఇటీవలే ఈ వ్యోమనౌక బుధుడికి మరింత చేరువైంది. నవంబర్‌లో బుధుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత ఈ మిషన్‌కు చెందిన రెండు వ్యోమనౌకలు విడిపోయి గ్రహంపై మరింత విస్తృత పరిశీలనలు చేపట్టనున్నాయి. బెపికొలంబో మిషన్‌లో భాగమైన నిషియామా మాట్లాడుతూ… వ్యోమనౌకలోని లేజర్ పరికరాలు బుధుడు వాస్తవానికి ఎంత మేరకు కుంచించుకుపోయాడో మరింత కచ్చితంగా తెలుసుకునేందుకు సహాయపడతాయని తెలిపారు. గతంలో నాసాకు చెందిన మెసెంజర్ వ్యోమనౌక 2010లలో బుధుడిని పరిశీలించి కీలక సమాచారం అందించింది. అంతకుముందు 1970లలో నాసా మారినర్-10 వ్యోమనౌక మాత్రమే బుధుడిని సందర్శించింది. మెసెంజర్ సేకరించిన సమాచారంతో చేసిన అంచనాల కంటే కూడా బుధుడి సంకోచం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బెపికొలంబో నుంచి అందనున్న తాజా పరిశీలనలు ఈ అంశంపై మరింత స్పష్టత ఇవ్వనున్నాయి.

బుధుడు ఎలా ఏర్పడ్డాడు? కాలక్రమంలో దాని లోపలి భాగంలో ఎలాంటి మార్పులు జరిగాయి? దాని ఉపరితలం ఎందుకు ఇలా ముడతలు పడింది? వంటి ప్రశ్నలకు తాజా అధ్యయనం, బెపికొలంబో మిషన్ కలిసి సమాధానాలు అందించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. “బుధుడి పరిణామానికి సంబంధించిన వాస్తవిక చిత్రానికి మేము మరింత దగ్గరవుతున్నామనే ఉత్సాహం ఉంది” అని గాకు నిషియామా వివరించారు. బెపికొలంబో నుంచి అందనున్న తాజా సమాచారం బుధుడు ఎంత మేరకు కుంచించుకుపోయాడో మాత్రమే కాకుండా, దాని లోపలి నిర్మాణం, కోట్లాది సంవత్సరాల పరిణామ గాథపై కూడా కొత్త విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -