Sunday, August 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅధికారుల నిర్లక్ష్యంతో నిలిచిన పారిశుధ్యం..

అధికారుల నిర్లక్ష్యంతో నిలిచిన పారిశుధ్యం..

- Advertisement -

– రెండేళ్లుగా అందని రక్షణ కిట్లు
– వేతనాల జాప్యంతో కార్మికుల ఆగ్రహం
– వర్షాకాలంలో పారిశుధ్యం స్తంభింపు
–  సీజనల్ వ్యాధులపై ప్రజల ఆందోళన
– అందుబాటులో లేని కమిషనర్, సానిటరీ ఇన్‌స్పెక్టర్
నవతెలంగాణ–పరకాల: 
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న తరుణంలో పరకాల మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల అనూహ్య విధుల బహిష్కరణ పట్టణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో పట్టణంలో పారిశుధ్య వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ప్రధాన రహదారులు, కాలనీలు, కూరగాయల మార్కెట్, ఏరియా ఆసుపత్రి, పాత ఏటీఎం సెంటర్, బస్టాండ్ పరిసరాలు, వ్యాపార సముదాయాలు, ఇతర ప్రధాన వీధుల్లో చెత్త తొలగింపు జరగకపోవడంతో చెత్తకుప్పలు పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యంతో పాటు అంటువ్యాధుల వ్యాప్తిపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధుల బహిష్కరణకు గల కారణాలపై కార్మికులు మాట్లాడుతూ.. 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన యూనిఫాంలు, సబ్బులు, నూనె, హ్యాండ్ గ్లౌజులు, చెప్పులు తదితర రక్షణ కిట్లను ఇప్పటివరకు అందించలేదని ఆరోపించారు. నెలవారీ వేతనాలు కూడా సకాలంలో చెల్లించడం లేదని, పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా స్పందన లేదని తెలిపారు. దీంతో నిరసనగా విధులను బహిష్కరించినట్లు వెల్లడించారు.

ఉదయం 10 గంటలు దాటినా పరిస్థితిని సమీక్షించేందుకు అధికార యంత్రాంగం రాకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ అంశంపై వివరణ కోసం నవతెలంగాణ ప్రతినిధి మున్సిపల్ కమిషనర్ పి. పవన్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డిని ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. వెంటనే కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించి పారిశుధ్య సేవలను పునరుద్ధరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -