Saturday, September 12, 2026
E-PAPER
Homeజిల్లాలుఅప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ధర్నా

అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ధర్నా

- Advertisement -

నవతెలంగాణ-వనపర్తి 
అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ వనపర్తి మండలం నాచహల్లి క్రిష్ణగిరి, పెద్దగూడెం తండా, సవాయిగూడెం గ్రామాలకు చెందిన రైతులు శనివారం సబ్‌స్టేషన్ సమీపంలో ఆందోళనకు దిగారు. వనపర్తి–పెబ్బేరు ప్రధాన రహదారిపై బైఠాయించి విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ చంద్రశేఖర్ అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే డీఈతో మాట్లాడించాలని రైతులు పట్టుబట్టారు. దీంతో ఏఈ ఫోన్ ద్వారా డీఈతో రైతులకు మాట్లాడించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు 13 గంటల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కూడా టీవీల్లో ప్రభుత్వ ప్రకటనలను చూస్తున్నామని, ప్రజలకు ఏమీ తెలియదన్నట్లుగా అధికారులు ఇష్టానుసారంగా అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

ఏఈతో కలిసి లాగ్‌బుక్‌ను పరిశీలించగా.. వాస్తవంగా సరఫరా చేసిన సమయం కంటే ఎక్కువ సమయం విద్యుత్ ఇచ్చినట్లుగా నమోదు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేశారని, ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. “కేసీఆర్ ప్రభుత్వం పోయినప్పుడే కరెంటు కూడా పోయిందా?” అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

  పంటలు ఎండిపోకుండా అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించి రైతులను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు మండల పార్టీ అధ్యక్షులు కే మాణిక్యం, సింగల్ విండో అధ్యక్షులు రఘువరన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ధర్మనాయక్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ డేగ మహేష్ రెడ్డి, నాయకులు రవి ప్రకాష్ రెడ్డి, నారాయణ నాయక్, శంకర్ నాయక్, టికె నాయక్, సర్పంచ్ పద్మ వెంకటయ్య,మాజీ సర్పంచ్ బాలకృష్ణ, మహేష్, అంజి, రూప్ల నాయక్, గోవిందు నాయక్,శివ,ఆనంద్, తులసి రామకృష్ణ, శ్రీను, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -