నవతెలంగాణ – అశ్వారావుపేట
పామాయిల్ గెలల దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు, కలెక్షన్ ఏజెంట్లతో శనివారం పోలీసులు సమావేశమయ్యారు. అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి, దమ్మపేట ఎస్సై రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు.ఆయిల్ఫెడ్ డీఓ శబావత్ శంకర్,అప్పారావు పేట, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీల మేనేజర్ లు నాగబాబు,ఎం ఎన్ కార్తీక్ పాకలగూడెం పామాయిల్ గెలల కలెక్షన్ ఏజెంట్ పాల్గొన్నారు.
పామాయిల్ గెలల దొంగతనాలను అరికట్టేందుకు ప్రతి రైతు ఎఫ్-కోడ్‌పై తగిన పరిమితి విధించాలని, దాని దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గెలల రవాణా జరిగే ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రైతులు తమ తోటలను నిరంతరం పర్యవేక్షిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను గమనించాలని తెలిపారు.
గెలలను ఫ్యాక్టరీలకు తరలించేందుకు నమ్మకమైన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలని, రాత్రివేళ అనుమానాస్పదంగా గెలల లోడింగ్, అన్‌లోడింగ్ జరుగుతున్నట్లు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రైతులు తమ ఎఫ్-కోడ్ వివరాలను ఇతర వ్యక్తులతో పంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాల నివారణకు రైతులు, ఫ్యాక్టరీల యాజమాన్యాలు, కలెక్షన్ ఏజెంట్లు, డ్రైవర్లు సమన్వయంతో పనిచేయాలని పోలీసు అధికారులు కోరారు.



