నవతెలంగాణ – రాయపోల్
తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ సింధం శేషికాంత్ నియమితులయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కల ఆదేశాల మేరకు రాష్ట్ర సర్పంచుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ శేషికాంత్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. శనివారం హైదరాబాద్ లక్డీకాపూల్లోని సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శేషికాంత్కు నియామక పత్రాన్ని అందజేశారు.
అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సింధం శేషికాంత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర మంత్రులకు, సర్పంచుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు సౌదాని భూమన్న యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలోని సర్పంచులను సమన్వయం చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.గ్రామ పంచాయతీల బలోపేతం, సర్పంచుల హక్కుల పరిరక్షణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన నిధులు, అధికారాల సాధన కోసం ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్తానని తెలిపారు. రాష్ట్రంలోని సర్పంచులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తానని శేషికాంత్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.



