కార్మికులు, పేదల పక్షాన నిరంతర పోరాటం
సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి, మండల నాయకుడు అందే అంజయ్య శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంజయ్య భౌతికదేహానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ.. అందే అంజయ్య నిరంతరం కార్మికులు, పేదలు, కర్షకుల సమస్యలపై పోరాడేవారని అన్నారు. సీపీఐ(ఎం) పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపునకు స్పందిస్తూ ముందుండి ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు.
ఆయన మృతి సీపీఐ(ఎం) పార్టీకి మాత్రమే కాకుండా పేద, కార్మిక వర్గాలకు కూడా తీరని లోటని పేర్కొన్నారు. పేదలు, కార్మికులు, కర్షకుల హక్కుల కోసం పోరాటాలను కొనసాగించడమే అందే అంజయ్యకు నిజమైన నివాళి అని మల్లేశం అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై మరింత ఉధృతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకుడు ఎంఏ ఇక్బాల్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి పౌలు, సీఐటీయూ జిల్లా నాయకుడు మోరిగాడి రమేష్, సూదగాని సత్య, రాజయ్య, నల్లమాస తులసయ్య, మిట్ట శంకరయ్య, సంఘీ రాజు, బాల్ నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.



