నవతెలంగాణ-ఆలేరు టౌను
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న టీచర్స్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ – ఫిన్లాండ్ (బ్యాచ్–2)కు యాదాద్రి భువనగిరి జిల్లా పి ఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ ( బాలురు) ఆలేరు పాఠశాలకు చెందిన ఆర్. సైదులు (స్కూల్ అసిస్టెంట్) ఎంపికయ్యారు. పాఠశాల విద్యలో అంతర్జాతీయ స్థాయి ఉత్తమ విధానాలను అధ్యయనం చేయడం, ఉపాధ్యాయుల వృత్తిపరమైన సామర్థ్యాలను మరింత పెంపొందించడం, ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఆధునిక విద్యా పద్ధతులను తెలుసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఫిన్లాండ్‌తో పాటు సింగపూర్, వియత్నాం, జపాన్ దేశాల్లో విద్యా విధానాలను పరిశీలించేలా ఈ ఎక్స్‌పోజర్ విజిట్‌ను రూపొందించారు.
ఫిన్లాండ్ బ్యాచ్–2 పర్యటనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 33 మందిలో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్ల జాబితాలో ఆర్. సైదులు చోటు దక్కించుకున్నారు. పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనున్నారు. ఎంపికైన ఉపాధ్యాయులు పర్యటనలో భాగంగా ఫిన్లాండ్‌లోని విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, పాఠశాలల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన పొందనున్నారు.
ఆర్. సైదులు ఫిన్లాండ్ విద్యా పర్యటనకు ఎంపిక కావడం పట్ల జెడ్పీహెచ్‌ఎస్ ఆలేరు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు దాసరి మంజుల,ఉపాధ్యాయులు, విద్యార్థులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ,స్థానిక విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.



