ఎంపీ పదవికి బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా

పార్టీగేట్‌ కుంభకోణంపై పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించినందుకు ఆంక్షలు
లండన్‌ : తన పార్లమెంట్‌ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. పార్టీ గేట్‌ కుంభ కోణంపై పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించినందుకు గానూ ఆయనపై ఆంక్షలు విధించనున్నట్లు కమిటీ ప్రకటించిన నేపథ్యంలో జాన్సన్‌ ఈ ప్రకటన చేశారు. కరోనా సమయంలో ప్రభుత్వం విధించిన నిబంధనలు, ఆంక్షలనే పలుసార్లు ఉల్లంఘించడానికి సంబంధించిన పార్టీగేట్‌ గురించి జాన్సన్‌ వరుసగా పార్లమెంట్‌లో చేసిన ప్రకటనలన్నీ తప్పుదారి పట్టించేలా వున్నాయని ఎంపీల దర్యాప్తులో వెల్లడైంది. దాంతో తన పార్లమెంట్‌ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సుదీర్ఘమైన ప్రకటన జారీ చేశారు.
తనను ఎలాగోలా బయటకు పంపాలన్నదే తన ప్రత్యర్ధుల ఉద్దేశ్యంగా వుందని ఆయన విమర్శించారు. తిరిగి పార్లమెంట్‌కు రావడానికి ప్రయత్నిస్తానని కూడా ఆయన సూచనప్రాయంగా తెలిపారు.
పార్లమెంట్‌ను వీడడం చాలా బాధగా వుందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ నుండి బయటకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రివిలైజెస్‌ కమిటీ నుండి తనకు లేఖ అందిందని, అది చూసి తాను చాలా విస్మయానికి గురయ్యానని చెప్పారు. దర్యాప్తు చేసిన కమిటీని కంగారూ కోర్టుగా ఆయన అభివర్ణించారు.
”వాస్తవాలతో నిమిత్తం లేకుండా నన్ను దోషిగా నిలబెట్టాలన్నది వారి ఆలోచనగా వుంది.” అని జాన్సన్‌ పేర్కొన్నారు. సబర్బన్‌ లండన్‌ సీటు నుంచి గెలిచిన జాన్సన్‌ ఇప్పుడు రాజీనామా చేయడంతో ఆయన ఎన్నిక నిర్వహించగలరన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

Spread the love