అమెజాన్‌ అడవుల్లో అద్భుతం !

– 40 రోజుల క్రితం విమాన ప్రమాదం నుంచి నలుగురు చిన్నారులు సజీవంగా…
బొగొటా, కొలంబియా: అమెజాన్‌ అడవుల్లో అద్భుతం చోటు చేసుకుంది. 40రోజుల క్రితం జరిగిన విమాన ప్రమాదంతో కారడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు సజీవంగా దొరికారు. కొలంబియా సైనికుల గాలింపు చర్యల్లో వీరిని కనుగొన్నట్లు అధికారులు ప్రకటించారు. వెంటనే వారిని బొగొటా తీసుకువచ్చి ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేశారు. అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ వార్త విన్నంతనే ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే వారితో మాట్లాడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఒక తల్లి పిల్లలైన వీరు వరుసగా 13, 9, 4, 11మాసాల వయసున్న వారు. ఈ 40రోజులు వారు ఎలా వున్నారు, ఏం చేశారు, తిన్నారు వంటి వివరాలేమీ ఇంకా తెలియరాలేదు. పిల్లలతో సైనికులు, వలంటీర్ల బృందం దిగిన ఫోటోను కొలంబియా మిలటరీ ట్వీట్‌ చేసింది. థర్మల్‌ బ్లాంకెట్‌లలో పిల్లలను కప్పి వుంచారు. మరొక సైనికుడు ఆ పసిబిడ్డ నోటికి బాటిల్‌ అందిస్తున్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. మే 1వ తేదీన తెల్లవారు జామున సింగిల్‌ ఇంజను విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు వున్నారు. ఇంజను వైఫల్యంతో విమానం కూలిపోతోందని పైలట్‌ ప్రకటించారు. ఆ వెంటనే రాడార్‌ నుండి విమానం కనుమరుగై పోయింది. దీంతో వారిలో ఎవరైనా జీవించి వుంటారేమోననే ఆశతో తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. కన్ను పొడుచుకున్నా కానరాని ఆ దట్టమైన అడవుల్లో యుద్ధ ప్రాతిపదికన గాలింపు చేపట్టారు. రెండు వారాల తర్వాత గాలింపు బృందానికి విమాన శిధిలాలు కనిపించాయి. అక్కడ ముగ్గురు పెద్దల మృత దేహాలు కనిపించాయి. కానీ పిల్లలు ఎక్కడున్నారో తెలియరాలేదు. దాంతో కొలంబియా ఆర్మీ గాలింపును ఉధృతం చేసింది. జాగిలాలతో 150మంది సైనికులు ఆ ఏరియాలోకి దిగారు. అక్కడి ఆదివాసీ గిరిజన తెగలకు చెందిన వలంటీర్లు కూడా పదుల సంఖ్యలో ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. చిట్టచివరకు వారి శ్రమ ఫలిస్తూ పిల్లలు దొరికారు. గాలింపు సమయంలో పిల్లల కోసం సైనికులు అక్కడక్కడా వదిలిన ఆహార పెట్టెలు బహుశా పిల్లలకు ఉపయోగపడి వుంటాయని భావిస్తున్నారు.

Spread the love