బీజేపీకి బిగ్‌ షాక్‌!

బీజేపీకి బిగ్‌ షాక్‌!– ఆ పార్టీకి 219 సీట్లే
– మొత్తం ఎన్‌డీఏకి 259
– సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ మెజార్టీ రాదు
– ఇండియా బ్లాక్‌కు 268 స్థానాలు
– కేంద్రంలో ఈ తడవ హంగ్‌
– పోటాపోటీగా ఎన్‌డీఏ, ఇండియా
– సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న యాక్సిస్‌ మై ఇండియా సర్వే
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కి 400 పైచిలుకు లోక్‌సభ స్థానాలొస్తాయని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా ఇత్యాది బీజేపీ అగ్రనేతలు డబ్బా కొడుతుండగా, అంత సీన్‌ లేదని పలు సర్వేలు కుండబద్దలు కొడుతున్నాయి. ‘యాక్సిస్‌ మై ఇండియా’ అనే సర్వే సంస్థ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో బీజేపీకి ఈమారు 208-219 సీట్లొస్తాయని అంచనా వేసింది. బీజేపీ మినహా ఎన్‌డీఏ పార్టీలకు 40 వరకు సీట్లొచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతోపాటు ప్రీపోల్‌, ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలన్నింటినీ ఏడవ దశ పోలింగ్‌ ముగిసే వరకు నిషేధించడంతో ‘యాక్సిస్‌ మై ఇండియా’ సర్వే ఫలితాలు బయట పెట్టలేదు. కానీ ఆ సర్వేలోని వివరాలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. కాగా ఈ సర్వే ఫేక్‌ అని సదరు సర్వే సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ గుప్తా ప్రకటన చేసినట్లు కూడా సోషల్‌ మీడియాలో ప్రచారం అయింది. ఇప్పటికే యోగేంద్ర యాదవ్‌, వంటి స్వతంత్ర జర్నలిస్టులు, మేధావులు, నిపుణులు పలువురు ఈ తడవ బీజేపీకి 220 సీట్లు దాటబోవని బల్లగుద్ది చెబుతున్న తరుణంలో ‘యాక్సిస్‌ మై ఇండియా’ సర్వే కూడా అందుకు తగ్గట్టు రావడంతో అటువైపు ప్రజలకు ఆసక్తి పెరిగింది.
ఎన్‌డీఏకి మెజార్టీ రాదు
ఈ ఎన్నికల్లో బీజేపీకి 208-219 సీట్లొస్తాయని సర్వే అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి 303 సీట్లోచ్చాయి. బీజేపీ మినహా ఎన్‌డీఏ పార్టీలకు ఈ ఎన్నికల్లో గరిష్టంగా 40 సీట్ల వరకు రానున్నాయి. ఎన్‌డీఏకి గరిష్టంగా 259 సీట్లొస్తారు. గత ఎన్నికల్లో ఎన్‌డీఏ మొత్తానికీ కలిపి 353 సీట్లొచ్చాయి. లోక్‌సభలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీస మెజార్టీ 273 సీట్లు ఉండాలి. ఈ సర్వే ప్రకారం ఎన్‌డీఏకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. బీజేపీ ఆశించినట్టు 400 సీట్లు రావడం అసాధ్యమని కూడా సర్వే విశ్లేషించింది. గత ఎన్నికల్లో బీహార్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, కర్నాటక, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గోవా.. ఈ 13 రాష్ట్రాల్లో బీజేపీకి గరిష్టంగా 93 శాతం సీట్లొచ్చాయి. ఈ రాష్ట్రాల్లో మొత్తం 256 సీట్లు ఉండగా 238 వచ్చాయి. ఇక ఈ రాష్ట్రాల్లో బీజేపీకి సీట్లు పెరిగే అవకాశం లేదు. ఇక గత ఎన్నికల్లో సగటున 60 శాతం వరకు సీట్లొచ్చిన ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, తెలంగాణ, అసోం, మిగిలిన ఏడు ఈశాన్య రాష్ట్రాలు. వీటిల్లో బీజేపీకి సీట్లు పెరిగితేనే 400 టార్గెట్‌ సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ గతం కంటే బీజేపీకి సీట్లు తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయని సర్వే వెల్లడించింది. గత ఎన్నికలతో పోల్చితే ఢిల్లీ 4, బీహార్‌ 10, హర్యానా 6, రాజస్థాన్‌ 9, కర్నాటక 14, జార్ఖండ్‌ 5, పశ్చిమబెంగాల్‌ 7, మహారాష్ట్ర 13, యూపీ 8, మధ్యప్రదేశ్‌ 5 సీట్ల చొప్పున బీజేపీ, ఎన్‌డీఏ కి తగ్గనున్నాయి.
ఇండియా, ఎన్‌డీఏ మధ్య నువ్వా నేనా
ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 115-120 సీట్లొస్తాయని ‘యాక్సిస్‌ మై ఇండియా’ సర్వే అంచనా వేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 52 సీట్లే వచ్చాయి. ఈ తడవ ఆ పార్టీ సీట్లు రెట్టింపు కానున్నాయి. కాంగ్రెస్‌ను మినహాయించి ఇండియా బ్లాక్‌లోని పార్టీలకు 120-148 సీట్లొస్తాయని సర్వే తెలిపింది. ఎన్‌డీఏ కి గరిష్టంగా 259 సీట్లొస్తుండగా, ఇండియా బ్లాక్‌కు 268 సీట్లు రావొచ్చని తెలిపింది. కనిష్టంగా చూసుకుంటే ఎన్‌డీఏకు 243, ఇండియాకు 242 సీట్లు రావొచ్చని తెలిపింది. అలాగే బీజేపీకి 208, కాంగ్రెస్‌కు 123 వస్తాయి. మొత్తం సీట్లలో 44 శాతం ఎన్‌డీఏ కి, 43 శాతం ఇండియాకి, 13 శాతం ఇతరులకు రానున్నాయి. ఈ తడవ లోక్‌సభలో హంగ్‌ వచ్చే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా దక్షిణాదిలో బీజేపీకి కొత్తగా వచ్చేదేమీ లేదు. ఎన్నికలు ముగిసిన తమిళనాడులో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. కర్నాటక, తెలంగాణాలో స్వల్పంగానే ఆ పార్టీకి సీట్లొస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని సర్వే అంచనా వేసింది. అయితే ఈ సర్వే వివరాలు వాస్తవం కాదని ఆ సంస్థ ఎండీ తెలిపారు.

Spread the love