ఇదేం ఖర్చు బాబోయ్…!

This is the cost Baboy...!– ‘సంపన్నుల క్లబ్‌’గా లోక్‌సభ
– చట్టసభలో పెరుగుతున్న కోటీశ్వరులు
– సామాన్యులకు ప్రవేశం కలలో మాటే
– ఎన్నికల్లో మితిమీరుతున్న ధన ప్రభావం
న్యూఢిల్లీ : లోక్‌సభ క్రమేపీ సంపన్నుల క్లబ్‌గా మారుతోందా?. దీనికి అవుననే సమాధానమే వస్తుంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో విజేతలైన వారు సగటున రూ.30 లక్షలు ఖర్చు చేశారు. 2014 నాటికి అది రూ.40 లక్షలకు, 2019 నాటికి రూ.50 లక్షలకు పెరిగింది. ఇది అభ్యర్థులు చూపిన అధికారిక ఖర్చు మాత్రమే సుమా!. అధిక ఓటర్లు ఉన్న పెద్ద నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.95 లక్షల వరకూ ఖర్చు చేయవచ్చు. చిన్న నియోజకవర్గాల్లో ఈ ఖర్చు రూ.75 లక్షలు దాటకూడదు. ఇదంతా కాగితాల పైనే. వాస్తవంగా అయ్యే ఖర్చు కోట్లలోనే ఉంటుంది.
ఖర్చుతో కూడిన వ్యవహారం
ప్రచార ఖర్చు సరేసరి. ఇక ఓటర్లకు పంచే తాయిలాల కోసం పెద్ద మొత్తంలో అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదంతా లెక్కలోకి రాదు. ఎన్నికల కమిషన్‌ విధించిన పరిమితికి లోబడే అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలు సమర్పిస్తారు. నామినేషన్‌ వేసినప్పటి నుండి పోలింగ్‌ ముగిసే వరకూ అభ్యర్థులు మంచినీళ్ల ప్రాయంగా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల సమరంలో దర్యాప్తు సంస్థలు ఇప్పటికే అక్రమంగా తరలిస్తున్న రూ.4,650 కోట్లకు పైగా సొమ్మును స్వాధీనం చేసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము పట్టుబడడం ఇదే మొదటిసారి. సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు రూ.1.2 ట్రిలియన్లు ఖర్చు చేస్తారని సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌) అంచనా వేసింది. ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఖర్చుతో కూడిన వ్యవహారమని, సామాన్యులు భరించలేరని దీనిని బట్టి అర్థమవుతోంది.
పరిమితి లేని పార్టీల వ్యయం
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమంటే అభ్యర్థుల ఖర్చుపై పరిమితి ఉంటుంది కానీ పార్టీల వ్యయంపై ఉండదు. ఇదే ఎన్నికల ప్రక్రియలో అతి పెద్ద లోపం. ఉదాహరణకు ఓ పార్టీ అభ్యర్థి ప్రచారసభ వేదికపై కూర్చున్నాడని అనుకోండి. వేదికపై ఆయన ఫొటో కానీ, పేరు కానీ, నియోజకవర్గం ప్రస్తావన కానీ లేకపోతే ఆ కార్యక్రమం ఖర్చు యావత్తూ పార్టీ ఖాతాలోనే పడుతుంది. వాస్తవానికి ఆ ఖర్చంతా అభ్యర్థిదే. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న పార్టీలు ఈ లొసుగునే ఆసరాగా చేసుకొం టున్నాయి. 2019లో జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో రూ.55,000 కోట్ల నుండి రూ.60,000 కోట్ల వరకూ ఖర్చు చేశారని సీఎంఎస్‌ తెలిపింది. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ సుమారు రూ.100 కోట్లు ఖర్చయ్యాయి.
సభలో సంపన్నులు
ఏదేమైనా ఎన్నికలు సంపన్నులకే ప్రయోజనకరంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఖర్చు చేయడానికి అవసరమైన ఆర్థిక వనరులు వారి వద్ద పుష్కలంగా ఉంటాయి. గత ఎన్నికల ఫలితాలను గమనిస్తే…ఆస్తుల విలువ రూ.5 కోట్లు, అంతకంటే ఎక్కువ ఉన్న అభ్యర్థుల్లో మూడో వంతు మంది 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆస్తుల విలువ రూ.10 లక్షల కంటే తక్కువ ఉన్న అభ్యర్థుల సక్సెస్‌ రేటు కేవలం 0.3 శాతం మాత్రమేనని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక చెబుతోంది. లోక్‌సభలో కోటీశ్వరుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 15వ లోక్‌సభలో (2009) 58 శాతం మంది ఎంపీలు కోటీశ్వరులు కాగా 16వ లోక్‌సభలో (2014) ఆ సంఖ్య 82 శాతానికి, 17వ లోక్‌సభలో (2019) 88 శాతానికి పెరిగింది. 2019 ఎన్నికల్లో విజేతలైన 539 మంది ఎంపీల ఆస్తులను ఏడీఆర్‌ విశ్లేషించింది. వీరిలో 475 మందికి కోటి రూపాయలు, ఆపై విలువ కలిగిన ఆస్తులు ఉన్నాయి. ఏదేమైనా ఎన్నికల్లో ధన ప్రభావం కాదనలేనిది. 17వ లోక్‌సభకు ఎన్నికైన 474 మంది ఎంపీల ఆస్తుల విలువ కోటి, అంతకంటే ఎక్కువే. అంటే సభలో వీరి సంఖ్య 88 శాతం. ఇక 18వ లోక్‌సభలో ఎంతమంది కోటీశ్వరులు అడుగు పెడతారో చూద్దాం !.

Spread the love