మోడీ ప్రభుత్వ నయవంచక విశ్వరూపం

మోడీ ప్రభుత్వ నయవంచక విశ్వరూపం– పదేండ్ల పాలనలో
– పది రంగాలలో వైఫల్యం
– బట్టబయలు చేసిన ‘ఇద్దెలు కర్నాటక’
న్యూఢిల్లీ : పది సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో బీజేపీ నయ వంచక విశ్వరూపం బయటపడింది. కాషాయ ప్రభుత్వం అన్ని రంగాలలో ప్రజలకు వైఫల్యాలనే రుచిచూపింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారిని వెన్నుపోటు పొడిచింది. దేశాన్ని అథోగతిలోకి నెట్టేసింది. మోడీ ప్రభుత్వ పది సంవత్సరాల నిరంకుశ పాలనలో జరిగిన పది నమ్మకద్రోహాలపై ‘ఇద్దెలు కర్నాటక’ అనే స్వతంత్ర పౌర సమాజ వేదిక ఓ నివేదికను రూపొందించింది. బీజేపీ ప్రభుత్వ పాలనలో సామాన్యుల జీవితాలు దుర్భరంగా మారిపోయాయి. నిత్యావసరాల ధరలు ఆకాశంతో పోటీ పడుతూ పైపైకి ఎగబాకుతున్నాయి. అదే సమయంలో ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయి. రుణభారం పెరుగుతోంది. భవిష్యత్తు అగమ్యగోచరంగా కన్పిస్తోంది. మోడీ కార్పొరేట్‌ స్నేహితులు అదానీ, అంబానీల సంపద మాత్రం ఇరవై రెట్లకు పైగా పెరిగింది. వారిద్దరూ ఇప్పుడు ప్రపంచ సంపన్నుల జాబితాలో స్థానం సంపాదించారు. అక్రమ సంపాదన ద్వారా బీజేపీ కూడా ప్రపంచంలో అతి పెద్ద సంపన్న పార్టీగా ఆవిర్భవించింది. నిరంకుశంగా వ్యవహరిస్తున్న కాషాయ పార్టీ కులం, మతం పేరుతో దేశ ప్రజాస్వామిక విలువలన్నింటినీ ధ్వంసం చేస్తోంది. విద్వేషాలను వ్యాపింపజేస్తూ, హింసకు పాల్ప డుతూ, వేధింపులకు దిగుతూ సమాజంలో వాతావరణాన్ని కలు షితం చేస్తోంది. దేశాన్ని పాలించాల్సిన వారే ఇప్పుడు జాతిని నాశనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వ పది సంవత్సరాల పాలనలో పది అతి పెద్ద నమ్మకద్రోహాలను ప్రజల ముందు ఉంచేందుకు ‘ఇద్దెలు కర్నాటక’ ప్రయత్నించింది. ఆ నయవంచనలు ‘నవ తెలంగాణ’ పాఠకుల కోసం ప్రతి రోజూ ఒక్కొక్కటిగా అందజేస్తున్నాము.
ప్రతి రోజూ దోపిడీయే
మోడీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ప్రతి రోజూ దోపిడీకి గురవుతూనే ఉన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ చెప్పిందొకటి…అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది మరొకటి. ప్రజలపై హామీల జడివాన కురిపించిన కమలదళం, చివరికి వారిని నిలువునా ముంచేసింది.
జరిగిందేమిటి?
గత పదేండ్లలో నిత్యావసరాల ధరలు రెట్టింపయ్యాయి. కొన్నింటి ధరలు అంతకంటే ఎక్కువగానే పెరిగాయి. 2014లో రూ.410 ఉన్న వంటగ్యాస్‌ ధర ఇప్పుడు రూ.906కు చేరింది. లీటర్‌ డీజిల్‌ ధర రూ.62 నుండి రూ.93కు, పెట్రోల్‌ ధర రూ.72 నుండి రూ.106కు, పొద్దుతిరుగుడు నూనె ధర రూ.80 నుండి రూ.160కి, కిలో గోధుమ పిండి ధర రూ.35 నుండి రూ.60కి, కందిపప్పు ధర రూ.75 నుండి రూ.150కి పెరిగింది. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో సామాన్యులు దోపిడీకి, మోసానికి గురవుతున్నారు.
ప్రభుత్వం చెబుతున్న కారణాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయని, అందుకే పెట్రోల్‌ ధరల పెంపు అనివార్యమైందని బీజేపీ చెబుతోంది. చమురు బాండ్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సి వస్తోందని, కోవిడ్‌ సమయంలో ఉచితంగా వ్యాక్సిన్‌ అందించామని, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ఆహార్‌ పథకం కింద బియ్యం పంపిణీ చేస్తున్నామని, వీటన్నింటి కారణంగా ధరలు పెరిగాయని అంటోంది.
వాస్తవాలు ఇవే
వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గింది. పెట్రోల్‌, డీజిల్‌పై సెస్సును పెంచడం, సబ్సిడీలను తగ్గించడం, వినియోగ వస్తువులపై జీఎస్టీ విధించడం వల్లనే ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలుపై పన్నును 9.48% నుండి 19.98%కి, డీజిల్‌పై 3.56% నుండి 15.58%కి పెంచారు. ప్రతి సిలిం డర్‌పై సబ్సిడీని రూ.500 తగ్గించారు. అన్ని వస్తువులపై 12% నుండి 18% జీఎస్టీ విధించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, రవాణా ఛార్జీలు పెరగడంతో నిత్యావస రాల ధరలకు రెక్కలు వచ్చాయి. వస్తువు లను విక్రయించే కంపెనీలపై పన్ను విధించడానికి బదులు వినియోగదారులపై జీఎస్టీ విధించారు.
బీజేపీ హామీలు
తాను అధికారంలోకి వస్తే నల్ల ధనాన్ని వెలికితీస్తానని, ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తానని బీజేపీ హామీలు కురిపించింది. నిత్యావసరాల ధరలను కిందికి దించుతామని, ఇంధన ధరలు తగ్గిస్తామని, దారిద్య్రరేఖకు దిగువనున్న అన్ని కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు అందజేస్తామని వాగ్దానం చేసింది. అయితే ఈ హామీలలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదు.
ఆదాయం… ఖర్చులు
అదనపు పన్నులు, జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.58 లక్షల కోట్లు. రెండు డోసుల ఉచిత వ్యాక్సిన్‌పై అయిన ఖర్చు కేవలం రూ.36,500 కోట్లు మాత్రమే. గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనపై ఇప్పటి వరకూ పెట్టిన ఖర్చు రూ.4.6 లక్షల కోట్లు. పెట్రోలియం బాండ్ల రుణాలపై ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.1.03 కోట్లు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న లక్ష కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడానికి ప్రభుత్వం ప్రజల నుండి రూ.58 లక్షల కోట్లు దోచుకోవాలా?. వివిధ పద్దుల కింద పెట్టిన రూ.6 లక్షల కోట్ల ఖర్చులు పోను మోడీ ప్రభుత్వం ప్రజల నుండి రూ.52 లక్షల కోట్లు లూటీ చేసింది.

Spread the love