కమలదళంలో కలవరం

Disturbance in Kamaladalam– తొలి దశలో పోలింగ్‌ తగ్గడంతో బెంబేలు
– మళ్లీ తెర పైకి ‘మతం’ కార్డు మోడీ విద్వేష ప్రసంగానికి ప్రేరణ అదే
న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ముస్లిం మైనారిటీలపై విషం చిమ్మడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పరిశీలకులు ముక్తకంఠంతో చెబుతున్నారు. 2006 డిసెంబర్‌ 9న జాతీయాభివృద్ధి మండలి సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన ప్రకటనను సైతం మోడీ వక్రీకరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123 (3)ని కూడా ఆయన తన బన్‌స్వారా ర్యాలీలో ఉల్లంఘించారు. సార్వత్రిక ఎన్నికలలో 400 స్థానాలు గెలుచుకుంటామని బీజేపీ బీరాలు పలుకుతున్న విషయం తెలిసిందే. ప్రజల మద్దతు తమకు అంతగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ముస్లిం వ్యతిరేక వైఖరిని అనుసరించాల్సిన అగత్యం ఏమొచ్చింది? ప్రజల మధ్య మతపరమైన విభజనను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? విద్వేష ప్రసంగాలతో రాజకీయ వాతావరణాన్ని ఎందుకు కలుషితం చేస్తున్నారు? రాజస్థాన్‌తో పాటు పలు రాష్ట్రాలలో ఈ నెల 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరిగింది. బీజేపీకి కంచుకోటలుగా భావిస్తున్న స్థానాలలో 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి తక్కువ పోలింగ్‌ నమోదు కావడం కమలదళాన్ని కలవరపెడుతోంది. ఉదాహరణకు రాజస్థాన్‌లో ఈ నెల 19న 58 శాతం పోలింగ్‌ జరిగింది. 2019 ఎన్నికలలో ఈ రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాలనూ బీజేపీయే గెలుచుకుంది. ఆ ఏడాది 63.71 శాతం ఓటింగ్‌ నమోదైంది. పోలింగ్‌ తక్కువగా జరగడంతో కంగుతిన్న బీజేపీ, మరోసారి హిందూత్వ అజెండాను బయటికి తీసింది. ప్రధాని ప్రసంగంలో అది కన్పించింది కూడా.
బీజేపీ నేతలు హిందూత్వ కార్డును ప్రయోగిస్తున్నప్పటికీ 2019లో మాదిరిగా ఫలితాలు ఏకపక్షం కాబోవని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. బన్‌స్వారాలో భారత్‌ ఆదివాసీ పార్టీ (బీఏపీ)కి కాంగ్రెస్‌ మద్దతు ఇస్తోంది. ఆ పార్టీ సభలు, ర్యాలీలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. బీఏపీ తరఫున ఛొరాసీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ రోట్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుండి వలస వచ్చిన మహేంద్రజిత్‌ సింగ్‌ మాల్వియాను బీజేపీ అభ్యర్థిగా నిలిపింది. అయితే రోట్‌కే ప్రజాదరణ అధికంగా లభిస్తోంది.
బ్యాంక్‌ ఖాతాల స్తంభన, ఈడీ దాడులు, పార్టీ నుండి వలసలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తోంది. మోడీ పాలనపై ఆ పార్టీ నేతలు గణాంకాలతో సహా విరుచుకుపడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా సమయంలో ముందస్తు ప్రణాళిక లేకుండా విధించిన లాక్‌డౌన్‌, నత్తనడకన సాగిన కోవిడ్‌ సహాయ కార్యక్రమాలు వంటి పరిణామాలు భారతీయ కుటుంబాలను అత్యధిక అప్పుల ఊబిలోకి (జీడీపీలో 40 శాతం) నెట్టాయని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ విమర్శించారు. నికర పొదుపు కనిష్ట స్థాయికి (జీడీపీలో 5 శాతం) పడిపోయిందని తెలిపారు.
అనేక మంది తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులలో తాకట్టు పెట్టి కుటుంబాలను గడుపుకోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వ అసమర్ధత, నిర్లక్ష్యం, నిర్వహణాలోపం కారణంగా ఒక్క కోవిడ్‌ సమయంలోనే భారతీయ మహిళలు రూ.60,000 కోట్ల విలువైన బంగారాన్ని బ్యాంకులలో కుదవ పెట్టారని ఆయన గుర్తు చేశారు. వారు ఆ అప్పులు తీర్చలేకపోవడంతో తాకట్టు బంగారాన్ని బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు వేలం వేశారని, అందుకోసం పత్రికలలో పూర్తి పేజీ ప్రకటనలు ఇచ్చారని జైరాం రమేష్‌ చెప్పారు.

Spread the love