మోడీ మాటల్లో నిజమెంత..?

How true is Modi's words?– పదేండ్లలో తగ్గిన ముస్లిం జనాభా
– మన్మోహన్‌ సింగ్‌ చెప్పింది ఒకటి మోడీ ఆరోపించేది మరొకటి
న్యూఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లో ఆదివారం ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దేశంలో ముస్లింలు అధిక సంఖ్యలో పిల్లలను కలిగి ఉన్నారు అని మోడీ ఆరోపించారు. అలాగే, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశంలోని వ్యక్తిగత సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందని ఆరోపించారు. 2024 కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఈ మేరకు వాగ్దానం చేశారని మోడీ తెలిపారు. సంపద అసమానతలను ప్రస్తావిస్తూ మ్యానిఫెస్టోలో ప్రస్తావించిన వివిధ అంశాలను కలుపుతూ మోడీ ఈ ఆరోపణలు చేశారు. అలాగే ‘దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కు’ అని 2006లో అప్పటి ప్రధానమంత్రి, కాంగ్రెస్‌ నాయకులు మన్మోహన్‌ సింగ్‌ చెప్పారని మోడీ ఆరోపించారు. అయితే మోడీ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. ముఖ్యంగా దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందన్న వ్యాఖ్యలకు ఎటువంటి ఆధారాలూ లేవు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే గత కొన్ని ఏళ్ల నుంచి ముస్లింల సంతానోత్పత్తి రేటు సిర్థంగా ఉంది. అదేవిధంగా ఇతర మతాల సంతానోత్పత్తి రేటు, ముస్లింల సంతానోత్పత్తి రేటు మధ్య ఉన్న అంతరం తగ్గుతోంది. సంతానోత్పత్తి రేటు అంటే ఒక స్త్రీ తన జీవితకాలంలో కలిగి ఉన్న పిల్లల సగటు సంఖ్య. ఇది స్థిరంగా ఉంటే జనాభా సంఖ్య కూడా స్థిరంగానే ఉంటుంది. ప్రభుత్వ సంస్థల గణాంకాల ప్రకారమే ఇతర మతాల సంతానోత్పత్తి రేటుతో పాటు ముస్లింల సంతానోత్పత్తి రేటు కొన్ని సంవత్సరాలుగా బాగా తగ్గుతోంది. 2019-21 సమాచారం ప్రకారం ముస్లింల సంతానోత్పత్తి రేటు 2.36. అలాగే హిందు, ముస్లిం సంతానోత్పత్తి రేటు మధ్య అంతరం రేటు తగ్గుతూ వస్తోంది. 20 ఏండ్ల క్రితం 0.81గా ఉన్న రేటు ప్రస్తుతం 0.42గా ఉంది. దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా ఉంది. దీనిని బట్టీ దేశంలో ముస్లిం జనాభా వేగంగా పెరుగుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.అలాగే ‘దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కు’ అని మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్‌ నాయకులు మన్మోహన్‌ సింగ్‌ చెప్పారని మోడీ ఆరోపించారు. మోడీ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. మన్మోహన్‌ సింగ్‌ చెప్పారని మోడీ చెబుతున్నది ఒక ప్రభుత్వ ప్రకటన గురించి. ఒక ప్రభుత్వ ప్రకటనలో ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన విషయాన్ని మోడీ తనకు అనుకూలంగా చెబుతున్నారు.
డిసెంబర్‌ 6, 2006న ఒక ప్రభుత్వ పత్రికా ప్రకటనలో డాక్టర్‌ సింగ్‌ ఈ విధంగా పేర్కొన్నారు. ‘మా సమిష్టి ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. వ్యవసాయం, నీటిపారుదల, నీటి వనరులు, ఆరోగ్యం, విద్య… ఎస్‌సీ-ఎస్‌టీలతో పాటు ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళలు, చిన్నారుల సంక్షేమానికి చెందిన కార్యక్రమాలు ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు భరోసా కల్పించేందుకు మేము వినూత్న ప్రణాళికలను రూపొందించాలి. దీంతో అభివృద్ధి ఫలాలను సమంగా పంచుకునే అధికారం ఉంది. దేశంలోని వనరులపై వారికే (మైనార్టీలు) మొదటి హక్కు ఉండాలి’ అని సింగ్‌ తెలిపారు. ఈ ప్రకటనలో మన్మోహన్‌ సింగ్‌ సమాజంలోని అన్ని బలహీన వర్గాలను ప్రస్తావించినా, మోడీ మాత్రం ముస్లింల గురించే మన్మోహన్‌ సింగ్‌ చెప్పారని మోడీ అసత్య ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నిజంగా అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మైనార్టీల్లో ముస్లిం మైనార్టీల గురించే చెప్పారని అనుకున్నా ఆ సమయంలో విడుదలైన అనేక సూచీల ప్రకారం ముస్లింలు ఇతర మతస్థులు కంటే అనేక అంశాల్లో వెనుకబడి ఉన్నారు. ముఖ్యంగా విద్యా, ఉపాధి, నవజాత శిశువుల మరణాలు వంటి వాటిల్లో ముస్లింలు, ఇతర మతస్థుల మధ్య అంతరం చాలా దారుణంగా ఉంది. ఇప్పటికే అదే పరిస్థితి కొనసాగుతోంది.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ముస్లిం జనాభా 17.22 కోట్లుగా ఉంది. అప్పుడు దేశ జనాభా మొత్తం 121.08 కోట్లు. అందులో 14.2 శాతం మంది ముస్లింలు ఉన్నారు. అంతకంటే ముందు 2001 జనాభా లెక్కల ప్రకారం ముస్లిం జనాభా 13.81 కోట్లుగా ఉంది. ఇది దేశ జనాభాలో 13.43 శాతం. అప్పుడు దేశ జనాభా 102.8 కోట్లుగా ఉంది.
2001-2011 మధ్య కాలంలో ముస్లిం జనాభా 24.69 శాతం పెరిగింది. ఇది దేశ చరిత్రలో అతి తక్కువ జనాభా వృద్ధి రేటును సూచిస్తోంది. 1991-2001 మధ్య, ముస్లిం జనాభా 29.49 శాతం వృద్ధి రేటు ఉంది. దీనిబట్టి ముస్లిం జనాభా వృద్ధి రేటు పెరుగుదలలో తగ్గుదల ఉందని స్పష్టం అవుతుంది.
నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఒ) ప్రకారం, ఇతర మతాలతో పోలిస్తే ముస్లిములలో లేబర్‌ ఫోర్స్‌ పార్టిసిపేషన్‌ రేట్‌ (ఎల్‌ఎఫ్‌పిఆర్‌), వర్కర్‌ పాపులేషన్‌ రేషియో (డబ్ల్యుపిఆర్‌) తక్కువగా ఉన్నాయి. అదనంగా, ఎల్‌ఎఫ్‌పిఆర్‌, డబ్ల్యుపిఆర్‌లలో క్షీణతను ఎదుర్కొంటున్న ఏకైక మతం కూడా ముస్లిములు. అయినప్పటికీ, ముస్లిములలో నిరుద్యోగిత రేటు (యుఆర్‌) జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. ఎల్‌ఎఫ్‌పిఆర్‌ అనేది జనాభాలోని శ్రామిక శక్తి (ఉద్యోగంలో ఉన్నవారు, ఉపాధిని కోరుకునేవారు, పని కోసం అందుబాటులో ఉన్నవారు) వ్యక్తుల నిష్పత్తిని సూచిస్తుంది. డబ్ల్యుపిఆర్‌ జనాభాలో ఉపాధి పొందిన వ్యక్తుల శాతాన్ని సూచిస్తుంది. కార్మిక శక్తిలో ఉన్నవారిలో నిరుద్యోగుల శాతాన్ని యూఆర్‌ సూచిస్తుంది.

Spread the love