పేదలపై పోలీసుల దౌర్జన్యం

Police brutality against the poor– పారా మిలిటరీ సహాయంతో గుడిసెల తొలగింపు
– గుడిసెవాసులపై పిడిగుద్దులు.. మహిళలకు గాయాలు
– సీపీఐ(ఎం) నాయకుల అరెస్ట్‌
– నాయకుడు చుంచు విజేందర్‌ను ఈడ్చుకెళ్లిన పోలీసులు
–  బచ్చన్నపేటలో ఉద్రిక్తత
నవతెలంగాణ-జనగామ
పేదలు ఇండ్ల కోసం చేస్తున్న భూపారాటంపై పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిలో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను బలవంతంగా తొలగించారు. నిరుపేదలపై విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకున్న మహిళలపై పోలీసులు పిడిగుద్దులు గుద్ది గాయపరిచారు. నాయకులను ఈడ్చుకెళ్లారు.
జనగామ జిల్లా బచ్చన్నపేట గోపాల్‌ నగర్‌లోని సర్వేనెంబర్‌ 174లో ఉన్న ప్రభుత్వ భూమిలో నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. శనివారం ఉదయం పోలీసులు పారా మిలిటరీ బలగాలతో గుడిసెవాసులను చుట్టుముట్టారు. పేదలందరూ ఎర్రజెండాలు చేతపట్టి గుడిసెలు వేస్తున్న క్రమంలో పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. మహిళలపై మగ పోలీసులు పిడిగుద్దులు గుద్దారు. భయాందోళనకు గురిచేసి పేదలను చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేశారు. అక్కడున్న సీపీఐ(ఎం) నాయకులు ఏడుగురుని పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు చుంచు విజయేందర్‌ను ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలో మహిళలు అడ్డురాగా, తోపులాట జరిగింది. వారిపై పోలీసులు పిడిగుద్దులు గుద్దారు. మిలిటరీ బలగాలతో గుడిసెవాసులను తోసేసి ఈడ్చుకుంటూ లాక్కెళ్లి పోలీసు వాహనంలో పడేశారు. సీపీఐ(ఎం) నాయకులను నర్మెట్ట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గుడిసెవాసులను బలవంతంగా అక్కడి నుంచి పంపించినా తిరిగొచ్చి అదే భూమిలో గుడిసెలు వేశారు. దీంతో మరోసారి పోలీసులకు గుడిసెవాసులకు వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఏదేమైనా ఇక్కడి నుంచి కదిలేది లేదని, గుడిసెలు వేసుకుని తీరుతామని పేదలు బీష్మించుకూర్చున్నారు. దీంతో జనగామ ఏసీపీ దామోదర్‌ రెడ్డి వారికి నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు.
174 సర్వే నెంబర్‌ భూమి విషయంలోనే రిటైర్డ్‌ ఎంపీడీవో హత్యకు గురయ్యాడు. ఆ భూమిని ఆక్రమించుకున్న గిరబోయిన అంజయ్య కిరాయి గూండాలతో హత్య చేయించాడనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. ఆరు నెలలుగా అక్కడ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేస్తుండగా.. పోలీసులు తొలగిస్తూ వస్తున్నారు. ఇకపై భయపడేది లేదని పేదలు తెగేసి చెప్పారు. ఈ సందర్భంగా గోపాలపురం గుడిసెవాసుల సంఘం నాయకులు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు చుంచు విజయేందర్‌ మాట్లాడుతూ.. అణచివేతలతో భూపారాటాలను ఆపలేరన్నారు. ఉండటానికి కనీసం ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే పోలీసులు దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారమే ఇల్లు లేని నిరుపేదలు ప్రభుత్వ స్థలంలోనే గుడిసెలు వేసుకుంటున్నారని, అలాంటప్పుడు తప్పెట్లవుతుందని ప్రశ్నించారు. తహసీల్దార్‌ కావాలనే పోలీసులను పిలిపించి మాపై దాడి చేయించారని ఆరోపించారు. పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళలు అని చూడకుండా ఇష్టానుసారంగా చేతులు వేసి తోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళా ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌ ఇష్టానుసారంగా గుద్దారన్నారు. గుడిసెలను తాత్కాలికంగా తొలగించినప్పటికీ భూ పోరాటం ముందుకు పోతది తప్ప వెనక్కు తగ్గదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు రామగల్లా అశోక్‌, వెంకటవ్వ, భూ పోరాట కమిటీ కన్వీనర్‌ పర్వతం నర్సింలు, అన్న బోయిన రాజు, రాములు రాజవ్వ, మనీ ఎల్లయ్య, ఈదమ్మ, శోభ, కరుణాకర్‌, బాలరాజు, యాదగిరి, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. అరెస్టు చేసిన నాయకులను సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

Spread the love