మేడిగడ్డ బ్యారేజీపై ఎన్‌డీఎస్‌ఏ సమీక్షలు

NDSA reviews on Medigadda barrage– ఇంజినీర్లతో భేటీ తాత్కాలిక మరమ్మతులపైనా చర్చ
– రాహుల్‌ బొజ్జా సైతం హాజరు మాజీ ఈఎన్సీ మురళీధర్‌ ‘ఆబ్సెంట్‌’
– జలసౌధలో రోజంతా మంతనాలు మీడియాకు ‘నో’ ఎంట్రీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డిఎస్‌ఏ) బృందం శనివారం హైదరాబాద్‌లో ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సమీక్షలు నిర్వహించింది. పరపాలనా సంబంధిత అధికారులు, మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్పంచుకున్న వారంతా హాజరయ్యారు. ఎన్‌డీఎస్‌ఏ నియమిత నిపుణుల కమిటీ చైర్మెన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ దాదాపు 100 మంది ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, సిబ్బందితో జలసౌధలో భేటీ అయ్యారు. ఆయా అంశాలపై వారి నుంచి సమాచారం సేకరించారు. కొంత మంది ఇంజినీర్లతో విచారించే పద్దతిలో మాట్లాడినట్టు తెలిసింది. ఇంకొందరిని కాస్త గట్టిగానే మందలిచ్చినట్టు సమాచారం. పర్యటనకు రాకముందే 19 అంశాలకు సంబంధించి సమాచారం ఇవ్వాలని అడిగిన కమిటీ చైర్మెన్‌, సభ్యులు విషయం విదితమే. ఉదయం జలసౌధకు చేరుకున్న ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీ తొలుత తెలంగాణ సాగునీటి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాతో భేటీ అయింది. తర్వాత ఈఎన్సీలు ఒక్కొక్కరితో చర్చించారు.
అయితే ఈ కీలక సమావేశానికి తప్పక హారు కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాల్పంచుకున్న ప్రతి ఇంజినీర్‌ను ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ జనరల్‌గా వ్యవహరించిన సి.మురళీధర్‌రావుకు సైతం సమాచారం పంపారు. అయితే ఆయన సర్కారు ఆదేశాలను పట్టించుకోలేదు. సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఈ గైర్హాజరీ అంశం జలసౌధలో హాట్‌టాపిక్‌ మారింది. ఇంజిరింగ్‌ శాఖ బాధ్యులతో నిర్మాణ కంపెనీ ఎల్‌ అండ్‌ టీ చెందిన 20 మందిని పిలిచారు. సుమారు 50 మంది ప్రభుత్వ ఇంజినీర్లు సైతం వచ్చా రు. ఇతరులతో కలిపి మొత్తం 100 మంది వరకు ఈ భేటీలో పాల్గొన్నారు.
డ్యామేజీ ఎలా జరిగింది ?
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుకు కారణాలు, లోపాలను తేల్చేందుకు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డిఎస్‌ఏ) గత నాలుగురోజులు క్షేత్రస్థాయిలో పర్యటించింది. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించింది. రెండోరోజు అన్నారం, సుందిళ్ల బ్యారేజీ ప్రాంతాల్లో తిరిగింది. అన్నారం సరస్వతీ బ్యారేజ్‌లో బుంగలను చూసింది. తర్వాత బ్యారేజీ ఐదో బ్లాక్‌లోని 38వ ఫియర్‌ డౌన్‌ స్ట్రీమ్‌ ‘వెంట్‌’ను స్థానిక అధికారులతో కలిసి సందర్శించింది. ఆయా బ్యారేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, రాష్ట్ర అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు మూడు గంటలపాటు బ్యారేజీపై తిరిగి వివరాలు సేకరించారు. కాపర్‌డ్యామ్‌ ద్వారా కిందకు వెళ్లారు. ఏడవ బ్లాక్‌లో 18, 19, 20, 21 పిల్లర్లను తనిఖీ చేశారు. బ్యారేజీలోని ఏనిమిది బ్లాకులను దశలవారీగా పరిశీలించి, పూర్తిగా వీడియో, ఫోటోగ్రఫీ నిర్వహించారు. ఒక రోజంతా మేడిగడ్డ బ్యారేజీ వద్దే వివరాలు సేకరించిన నిపుణుల కమిటీ, బ్యారేజీ అప్‌స్ట్రీమ్‌, డైన్‌స్ట్రీమ్‌ వైపు విచారణ చేశారు. ప్రధానంగా 20వ పిల్లర్‌ కుంగుబాటుపై లోతుగా అధ్యయనం చేశారు. పగుళ్ల కొలతలను రికార్డు చేసిన నిపుణులు, డ్యామేజ్‌కు ముందు డ్యామేజ్‌కు తర్వాత తీసుకున్న చర్యలపై ఇంజినీరింగ్‌ అధికారులకు పలు ప్రశ్నలు సంధించారు. వర్షాకాలంలోపు తాత్కాలిక మరమ్మతులు చేయాల్సి ఉంటుందని ఎన్‌డిఎస్‌ఏ నిపుణులు ఇంజిర్లకు సూచించినట్టు తెలిసింది. ఇప్పటికిప్పుడు ఏంచేయాలనే విషయమై ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన ఇంజినీర్లతో చర్చించారు.
జలసౌధలో మీడియాకు నో ‘ఎంట్రీ’
ఎన్‌డీఎస్‌ఏ నియమిత నిపుణుల కమిటీ జలసౌథలో నిర్మాణ కంపెనీ అధికారులు, సాగునీటి శాఖ ఇంజినీర్లతో ఇన్‌కెమెరా సమావేశం నిర్వహించారు. రహస్యంగా భేటీలో అయ్యింది. జలసౌధలోకి మీడియాను అనుమతించలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమీక్ష జరిగింది. లేఖ ద్వారా అడిగిన 19 అంశాలపై రాహుల్‌ బొజ్జా, ఈఎన్సీ జనరల్‌ బి.అనిల్‌కుమార్‌తో చర్చించినట్టు చెప్పారు. తొలిరోజు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయిన చంద్రశేఖర్‌ అయ్యర్‌ బృందం , అనంతరం రెండు రోజులు ఫీల్డ్‌లో పర్యటించింది. నాలుగో రోజున ఇంజినీర్లతో సమావేశమై ప్రాజెక్టు పూర్వాపరాలు అధ్యయనం చేసింది. ప్రాథమిక నివేదికను నెలరోజుల్లో, పూర్తిస్థాయి నివేదికను నాలుగు నెలల్లో ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Spread the love