ఎర్రబెల్లికి బిగుస్తున్న ఉచ్చు..?

The trap that is tightening for the Red Bell..?– ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు దయాకర్‌రావు సన్నిహితులు
– ఆందోళనలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఉచ్చు బిగుస్తుందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ దిశగానే విచారణ జరగడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును అరెస్టు చేసి విచారణ చేస్తున్న నేపథ్యంలో ‘ఎర్రబెల్లి’తో సన్నిహితంగా వున్న పలువురు పోలీసు అధికారులను కూడా జనగామ జిల్లా నుంచి విచారణ నిమిత్తం తీసుకువెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
నవతెలంగాణ- వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి నలుగురు పోలీసు అధికారులను విచారణ అధికారులు తీసుకువెళ్లినట్టు సమాచారం. దీంతో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లి పేరు కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణాధికారులు తీసుకుపోయిన వారిలో గతంలో పాలకుర్తి ఇన్‌స్పెక్టర్లుగా పనిచేసిన అధికారులుండటం గమనార్హం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పోలీసు అధికారుల పోస్టింగ్‌లు స్థానిక ఎమ్మెల్యే సిఫారసులతోనే జరిగాయని గతంలో వార్తలు వచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎర్రబెల్లి పేరు వినిపిస్తోంది. దాంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డీఎస్పీ ప్రణీత్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు కావడంతో తెర వెనుక వున్న పెద్దల జాబితాను విచారణ అధికారులు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు, మాజీ మంత్రుల హస్తం వుండే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతోంది.
‘ఎర్రబెల్లి’ వర్గీయుల్లో ఆందోళన
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇటీవల తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేస్తూ తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. ఇదే సందర్భంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుకు ‘ఎర్రబెల్లి’ స్వగ్రామం పర్వతగిరితో బంధుత్వం ఉంది. ఎర్రబెల్లి వ్యాఖ్యలు ఆయన అనుచరుల్లో, బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కలకలం సృష్టించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి విచారణకు హాజరైన ఆ నలుగురు పోలీసు అధికారులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అత్యంత సన్నిహితులని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కేసులో ఇంకెవరి ప్రమేయం బహిర్గతమవుతుందోనన్న భయాందోళన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో ఉంది.
బీఆర్‌ఎస్‌లో స్తబ్ధత
రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు బీఆర్‌ఎస్‌కు ప్రతికూలంగా మారాయి. ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడంతో ఆ పార్టీలో స్తబ్ధత నెలకొంది. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఢిల్లీలోనే మకాం వేశారు. దీంతో పార్టీ నేతలు మౌనంగా వుండిపోయారు. రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటుండటంతో ఏ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న భయాందోళన పార్టీ శ్రేణుల్లో వుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య వున్న రాజకీయ వైరుధ్యం నేపథ్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తనను ఇరికిస్తారేమోనన్న ఆందోళనలో వున్నట్టు కనిపిస్తుంది.

Spread the love