కేజ్రీవాల్‌ అరెస్ట్‌

Kejriwal arrested– ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ అదుపులోకి..
– ఢిల్లీ అంతటా నిషేధాజ్ఞలు
– ఆప్‌ నేతల నిరసనలు..పారా మిలటరీ మధ్య ఉద్రిక్తత
– అరెస్టు నుంచి విముక్తి చేయలేమన్న ఢిల్లీ హైకోర్టు.. మారిన సీను
– లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ సర్కార్‌ చర్యపై ప్రతిపక్షాల ఆగ్రహొం అరెస్టును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు తలుపుతట్టిన కేజ్రీవాల్‌
– ఆయనే సీఎం.. జైలు నుంచే పరిపాలన: మంత్రి అతిషీ
ప్రతిపక్ష నాయకులను వేటాడడమే పనిగా పెట్టుకున్న మోడీ ప్రభుత్వం తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై పడింది. నాటకీయ పరిణామాల మధ్య ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో అరెస్టు చేసింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలన్నిటిని ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన రోజునే ఈడీ ఈ చర్యకు పాల్పడడం గమనార్హం . కేజ్రీవాల్‌ అరెస్టును ఇండియా బ్లాక్‌లోని భాగస్వామ్య పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఈడీ బలవంతపు చర్యల నుంచి రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో దీనిపై కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇంతలోనే ఈడీ అధికారుల బృందం అయిదు బస్సుల నిండా రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌)ను వెంటేసుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి, ఆయన నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఆ వెంటనే ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామం పట్ల దిగ్భ్రాంతికి గురైన ఆప్‌ శ్రేణులు ఈడీ చర్యపై ఆగ్రహిస్తూ భారీ నిరసనలకు దిగారు. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులు నగరమంతటా నిషేధాజ్ఞలు జారీ చేశారు. కేజ్రీవాల్‌ అరెస్టు కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రగా ఆమాద్మీ పార్టీ నేతలు విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరిగితే ఓటమి తప్పదన్న భయంతోనే రాజకీయ పత్యర్థులను వెంటాడి వేధించే చర్యలకు అది తెగబడుతోందని సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది
రాత్రి 8:01: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఇంటి బయట పటిష్ట భద్రతా ఏర్పాట్లు ..ఆర్‌ఏఎఫ్‌ బలగాల మోహరింపు.
8:10: సీఎం కేజ్రీవాల్‌ ఫోన్లు ఈడీ జప్తు
8:32: ఈడీ కార్యాలయం వెలుపల భద్రత పెంపు.. సెక్షన్‌ 144 విధింపు
8:35: ఈడీ కార్యాలయానికి వెళ్లే రహదారిపై బారికేడింగ్‌, సెక్షన్‌ 144 బోర్డుల ఏర్పాటు
8:47: కేజ్రీవాల్‌ నివాసం ఎదుట ఆప్‌ నేతల నినాదాలు..అరెస్టులు
రాత్రి 8:57: ఢిల్లీ సీఎం ఇంటికి ఈడీ అధికారి కపిల్‌ రాజ్‌, ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 50 కింద కేజ్రీవాల్‌ వాంగ్మూలం నమోదు
9:08: కేజ్రీవాల్‌ నివాసం వెలుపల డ్రోన్లతో నిఘా
9:13: కేజ్రీవాల్‌ అరెస్ట్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్టు చేసింది. ఆయనను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆప్‌ కార్యకర్తలు అడ్డుకోబోగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. గురువారం ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌కు అరెస్ట్‌ నుంచి మినహాయింపు నిరాకరించిన కొద్ది సేపటికే సెర్చ్‌ వారెంట్‌తో ఢిల్లీలోని కేజ్రీవాల్‌ నివాసానికి చేరుకున్న 12 మంది ఈడీ అధికారుల బృందం సోదాలు ప్రారంభించింది. విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంది. కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం మొదటి నుంచీ జరిగింది. అందరూ అనుకున్నట్టుగానే ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకంటే ముందు.. శాంతిభద్రత ల సమస్య తలెత్తకుండా ఉండేందుకు కేజ్రీవాల్‌ ఇంటి వద్ద, ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఆప్‌ నేతలు, కార్యకర్తలు కేజ్రీవాల్‌ ఇంటి వద్దకు వచ్చినా.. వారందరినీ భద్రతా సిబ్బంది నిలువరించింది. లిక్కర్‌ స్కాం మనీలాండరింగ్‌ వ్యవహారంలో తొమ్మిది సార్లు విచారణకు రావాలని పిలిచినా హాజరయ్యేందుకు కేజ్రీవాల్‌ నిరాకరించారు. మరోవైపు తనపై బలవంతపు చర్యలు తీసుకోకుండా దర్యాప్తు సంస్థలకు ఆదేశాలివ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈడీ అరెస్టు చేసింది.
సుప్రీంకోర్టులో పిటిషన్‌
ఈడీ అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాదులు అత్యవసర విచారణను కోరుతూ.. సుప్రీంకోర్టు రిజిస్ట్రీని అభ్యర్థించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 కింద ఈడీ అరెస్టును సవాల్‌ చేస్తూ పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఆప్‌ కార్యకర్తల ఆందోళన
మరోవైపు, ఈడీ వైఖరిని నిరసిస్తూ కేజ్రీవాల్‌ ఇంటి వద్ద ఆప్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిణామాలతో సీఎం ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయడాన్ని ఆప్‌ నేతలు ముక్తకంఠంతో ఖండించారు.
ఆయనే సీఎం..జైలు నుంచే పరిపాలన
కేజ్రీవాల్‌ అరెస్టయినప్పటికీ ఆయనే సీఎంగా కొనసాగుతారని, జైలు నుంచే పరిపాలన చేస్తారని ఢిల్లీ మంత్రి అతిషీ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ అరెస్టు పెద్ద కుట్రేనని ఎంపీ రాఘవ్‌ చద్దా అన్నారు. ‘అరవింద్‌ కేజ్రీవాల్‌ అంటే ప్రజలకు ప్రేమ, అభిమానం. ఏదో సాకు చూపి, కారణాలు చూపి కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయొచ్చు.. కానీ ఆయన ఆలోచనలను అరెస్ట్‌ చేయలేరు. కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేస్తే వీధికో కేజ్రీవాల్‌ పుట్టుకొస్తారు. సోదాల పేరుతో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ ఫోన్‌ తీసుకున్నారు. ఆయన సెక్రెటరీ మొబైల్‌ కూడా తీసుకున్నారు. ఈ అరెస్ట్‌తో బీజేపీ పన్నాగం బయటపడింది. అని ఆప్‌ నేతలు సౌరభ్‌ భరద్వాజ్‌, అతిషి అన్నారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయడంపై ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రాం నివాస్‌ గోయెల్‌ స్పందించారు. మనీశ్‌ సిసోడియాను అరెస్టు చేసినా ఇప్పటివరకు ఏమీ దొరకలేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ గొంతు అణచివేసేందుకే.. ఆయనను అరెస్టు చేశారని, గోయెల్‌ విమర్శించారు.
కవిత అరెస్ట్‌ అందుకేనా…?
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన చార్జిషీట్లు, సంప్లమెంటరీ చార్జిషీట్లలో కవిత ప్రస్తావన ఉన్నా. నిందితురాలిగా ఎక్కడా చూపలేదు. సాక్షిగా కవిత స్టేట్మెంట్‌ను రికార్డు చేసినా ఈ అంశాన్ని సంప్లమెంటరీ చార్జిషీట్‌లో పొందుపరచలేదు. దాదాపు 36 మందిని విచారించినట్లు చూపినా కవిత పేరును విస్మరించడం అప్పట్లో పెద్ద ఎత్తున అనుమానాలకు తావిచ్చింది. అయితే, ఈడీ విచారణకు పిలిచిన ఏడాది తర్వాత దర్యాప్తు సంస్థలు వరుస పెట్టి కవితకు నోటీసులిచ్చాయి. సీబీఐ నేరస్తురాలి కింద నోటీసులిస్తే, సోదాల పేరుతో వెళ్లిన ఈడీ ఏకంగా ఆమెను అరెస్ట్‌ చేసింది. అయితే మరునాడు కోర్టు ముందు ప్రవేశపెట్టినా అరెస్ట్‌ రిపోర్ట్‌లో మాత్రం కవితను ఈడీ కింగ్‌ పిన్‌గా పేర్కొంది. అంతేకాదు…ఏకంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అగ్రనేతలు అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియాతో కవిత భేటీ అయి లిక్కర్‌ పాలసీ రూపకల్పన, అమలుపై చర్చించారని కీలక ఆరోపణ చేసింది. వీరితో కలిసి కవిత ఒక ఒప్పందం కుదుర్చుకొని, సౌత్‌ గ్రూప్‌ సభ్యులతో కలిసి దళారుల ద్వారా ముడుపులు చెల్లించారని తెలిపింది. ఇందుకు వైఎస్సార్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులు ఇచ్చిన స్టేట్మెంట్‌ను ఆధారంగా చూపింది. దీంతో కవిత అరెస్ట్‌ … కేజ్రీవాల్‌ టార్గెట్‌గానే జరిగిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కేజ్రీవాల్‌ పాత్రలో కీలకంగా మాగుంట స్టేట్మెంట్‌
ఢిల్లీలో లిక్కర్‌ బిజినెస్‌ చేసేందుకు కవిత ఇప్పటికే సంప్రదించారని, రూ.100 కోట్లు పార్టీకి చెల్లించేందుకు అంగీకరించారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ 2021 మార్చి 16న ఆయన ఆఫీసులో తనకు తెలిపారని మాగుంట శ్రీనివాసులురెడ్డి వెల్లడించినట్లు ఈడీ కస్టడీ రిపోర్టులో పేర్కొంది. గతేడాది జూలై 14, 17 తేదీలలో ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లలో ఈ విషయాలను మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారని పేర్కొంది. కవితను కలుసుకోవాల్సిందిగా కేజ్రీవాల్‌ తనకు సలహా ఇచ్చారని, ఆ తర్వాత 2021 మార్చి 19న కవిత తనకు స్వయంగా ఫోన్‌ చేసి హైదరాబాద్‌కు రమ్మన్నారని మాగుంట చెప్పినట్లు ఈడీ ప్రస్తావించింది. హైదరాబాద్‌లో తాను ఆమెను కలసుకున్నప్పుడు తాము చెల్లించాల్సిన రూ.100 కోట్లలో రూ.50 కోట్లు తన సీఎ బుచ్చిబాబుకు ఇవ్వాల్సిందిగా కవిత చెప్పారని మాగుంట వాంగ్మూలాన్ని చూపింది.
ఐదు రోజుల ఇన్వెస్టిగేషన్‌లో కేజ్రీవాల్‌ టార్గెట్‌గానే ఐదు రోజులుగా కస్టడీలో ఉన్న కవితను కేజ్రీవాల్‌ టార్గెట్‌గానే ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రోజు వారీగా ఎక్కువ సమయం ఇంటరాగేషన్‌ చేయకపోయినా… మాగుంట శ్రీనివాస్‌లు స్టేట్మెంట్‌ ఆధారంగా విచారణ చేస్తున్నట్టు సమాచారం. ‘కేజ్రీవాల్‌ను ఎప్పుడైనా కలిశారా? లిక్కర్‌ పాలసీ సందర్భంలో ముడుపుల అంశంపై చర్చ జరిగిందా? మాగుంట ఇచ్చిన స్టేట్మెంట్‌తో ఏమైనా సంబంధం ఉందా? ఆప్‌ నేతలతో సౌత్‌ గ్రూప్‌లోని సభ్యులెవరు చర్చలో పాల్గొనేవారు?’ వంటి అంశాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ విచారణలో కవిత స్టేట్మెంట్‌ లోని పలు అంశాలను ఈడీ రికార్డ్‌ చేసింది. వీటి ఆధారంగా కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.
సేమ్‌ సీన్‌ రిపీట్‌
లిక్కర్‌ స్కాంలో దర్యాప్తు సంస్థలు సోదాల పేరుతో అరెస్ట్‌లు కొనసాగిస్తున్నాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, ఆప్‌ ఎంపీ సంజరు సింగ్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర నిందితుల అరెస్ట్‌లో ఇదే రీతిలో వ్యవహరించాయి. ప్రస్తుతం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ విషయంలోనూ ఇదే జరిగింది. ఇక కవిత విషయంలోనూ ఈడీ అధికారులు చాలా ప్లాన్‌గా వ్యవహరించారు. తనపై బలవంతపు(అరెస్ట్‌) చర్యలు తీసుకో వద్దని కవిత వేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సోదాలు చేపట్టారు. అనంతరం అరెస్ట్‌ చేసి ఢిల్లీకి తరలించారు.
భయాందోళనలో బీజేపీ
కేజ్రీవాల్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం . ఇది ఇండియా కూటమిలో రెండో సిట్టింగ్‌ సీఎం అరెస్టు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారని మోడీ ప్రభుత్వం, బీజేపీ భయాందోళనకు గురవుతున్నాయి. పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరిన ప్రతిపక్ష నేతలందరికీ రక్షణ, ఆదరణ కల్పిస్తూ, లొంగని వారిని అరెస్టులతో టార్గెట్‌ చేసి బీజేపీ లబ్ది పొందాలనుకుంటుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇలాంటి చర్యలను ఖండించాలి.
– సీతారాం ఏచూరి
భయపడ్డ నియంత ..
భయపడ్డ నియంతే కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. మీడియాతో సహా అన్ని సంస్థలను కబ్జా చేయడం, పార్టీలను చీల్చడం, కంపెనీల నుంచి డబ్బులు దండుకోవడం, ప్రధాన ప్రతిపక్షం ఖాతా స్తంభింపజేయడం వంటి పైశాచికాలు సరిపోకపోగా, ఇప్పుడు ఎన్నికైన ముఖ్యమంత్రులను కూడా అరెస్టు చేస్తున్నారు. ఇది పిరికి చర్య.
 – రాహుల్‌ గాంధీ 
ఓటమి తప్పదన్న భయంతోనే..
‘దశాబ్దపు వైఫల్యాలు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం’ కారణంగానే ఈ అరెస్టు జరిగింది.కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం ద్వారా ఫాసిస్ట్‌ బీజేపీ ప్రభుత్వం జుగుప్సాకరంగా వ్యవహరించింది ”.
– తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌
మరీ ఇంత దిగజారుడా..?
బీజేపీ అధికారం కోసం ఎంతగా దిగజారిందో..కేజ్రీవాల్‌ అరెస్టు నిర్థారిస్తుంది. కేజ్రీవాల్‌పై ఈ రాజ్యాంగ విరుద్ధ చర్యకు వ్యతిరేకంగా ‘భారత్‌’ ఐక్యంగా నిలుస్తుంది”
– నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌.

Spread the love