తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అజరామరం…

Telangana armed peasant struggle Immortal...–  బాంచెన్‌ దొరా అన్నోళ్లతోనే బరిసెలెత్తించిన ఉద్యమం
–  విముక్తి పోరాటాలకు ఆ చరిత్ర స్ఫూర్తి..
– ఉద్యమ స్మృతులను కండ్లకు కట్టిన చిత్ర ప్రదర్శన
–  ప్రారంభించిన హైకోర్టు న్యాయవాది విద్యాసాగర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అజరామరం… అది విముక్తి ఉద్యమాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయక మని హైకోర్టు సీనియర్‌ న్యాయవాది జి విద్యాసాగర్‌ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఘట్టాలను తెలియజేసే ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. మొత్తం 100కు పైగా ఫొటోలను, పోరాట ఘట్టాలను కండ్లకు కట్టినట్టుగా వీక్షకులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేశారు. రజాకార్ల అకృత్యాలు, సర్దార్‌ వల్లభాయి పటేల్‌ సైన్యాల దారుణాలు, వీరుల పోరాట పటిమను ఆ చిత్రాలు సాక్షాత్కరింపచేశాచాయి. కుల, మతాలకు అతీతంగా భూమి, భుక్తి, విముక్తి పోరాటంలో అసువులు బాసిన వీరనారి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, బందగి, మఖ్దూం మోహినుద్దీన్‌, షోయబుల్లాఖాన్‌, బీమిరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, దేవులపల్లి వెంకటేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి లాంటి యోధులు..రాచరికంపై మట్టి మనుషులతో తుపాకులు పట్టించిన తీరు ఆ చిత్రాలద్వారా విధితమవుతున్నది. ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన విద్యాసాగర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతటి మహత్తర పోరాటానికి సంబంధమే లేని మతతత్వ శక్తులు దానికి మతం రంగు పులమాలని ప్రయత్నించటం శోచనీయమన్నారు. చరిత్రను వక్రీకరించే వారు నిజాలంటే భయపడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకులు జి రఘుపాల్‌, ఎం దశరథ్‌, మారన్న తదితరులు పాల్గొన్నారు.

Spread the love