దొంగ ఓట్లు వేస్తూ దొరికారు

– గుజరాత్‌లో బీజేపీ కార్యకర్తల అరెస్ట్‌
గాంధీనగర్‌: అసలే కోతి…ఆపై కల్లు తాగింది…అన్న చందంగా దొంగ ఓట్లు వేసిందే చాలక ఆ ఘనకార్యాన్ని సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేసిన ఇద్దరు బీజేపీ కార్యకర్తలను గుజరాత్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. మహిసాగర్‌ జిల్లా దాహోడ్‌ లోక్‌సభ స్థానానికి చెందిన బీజేపీ కార్యకర్తలు విజరు భభోర్‌, మనోజ్‌ మాగన్‌లను ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద అరెస్ట్‌ చేశామని పోలీస్‌ సూపరింటెండెంట్‌ జేదీప్‌సింగ్‌ జడేజా తెలిపారు. ప్రథంపురాలోని 220 నెంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో వీరు బోగస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆయన చెప్పారు. భభోర్‌ తండ్రి రమేష్‌ భభోర్‌ గతంలో సంత్రామ్‌పూర్‌ తాలూకా అధ్యక్షుడిగా పనిచేశారు. ఐపీసీలోని 171, 188 సెక్షన్ల కింద వీరిని అరెస్ట్‌ చేశారు. కాగా దొంగ ఓట్ల ఉదంతం నేపథ్యంలో ఆ కేంద్రంలో జరిగిన పోలింగ్‌ను రద్దు చేసినట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఈ నెల 11న అక్కడ రీపోలింగ్‌ జరుగనుంది. భభోర్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలో దొంగ ఓట్ల బాగోతం ప్రత్యక్షప్రసారం జరిగింది. భభోర్‌ మరో వ్యక్తితో కలిసి పోలింగ్‌ కేంద్రంలో ప్రవేశించాడు. ఈవీఎంను అనేకసార్లు చేతిలోకి తీసుకున్నాడు. ఎన్నికల అధికారుల హెచ్చరికలను కూడా పెడచెవిన పెట్టాడు. ‘మాకు పది నిమిషాల సమయం ఇవ్వండి. ఇక్కడే కూర్చుంటాం. ఉదయం నుండి పోలింగ్‌ కొనసాగుతోంది’ అని భభోర్‌ అంటున్నట్టు వీడియోలో కన్పించింది. బీజేపీ మాత్రమే గెలవాలని, ఈ ఈవీఎం తన తండ్రిదని కూడా అతను చెప్పాడు. బీజేపీ ఎన్నికల చిహ్నమైన కమలం గుర్తుపై బటన్‌ నొక్కాలని అతను అక్కడికి వచ్చిన ఓటర్లకు చెప్పాడు. ఈవీఎంను చేతిలో పట్టుకొని నాట్యం చేస్తున్న దృశ్యం కూడా వీడియోలో ఉంది. సామాజిక మాధ్యమంలో వీడియో వైరల్‌ కావడంతో రాష్ట్రంలో దుమారం రేగింది. కాగా సంత్రామ్‌పూర్‌లోని గోతిబ్‌లో ఇరవై ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో కూడా ఇద్దరు వ్యక్తులు బోగస్‌ ఓట్లు వేశారని కాంగ్రెస్‌ ఎన్నికల ఏజెంట్లు ఫిర్యాదు చేశారు. భభోర్‌, మాగన్‌లు తనపై దాడి చేసి బెదిరించా రని కాంగ్రెస్‌ ఏజెంట్‌ తెలిపారు. దొంగ ఓట్ల ఘటన నేపథ్యంలో నలుగురు పోలింగ్‌ అధికారులకు ఈసీ నోటీసులు జారీ చేసింది.

Spread the love