షుగర్‌ బెల్ట్‌లో శరద్‌ పవార్‌కే పట్టు

-‘పశ్చిమ మహా’లో బిజెపికి సవాల్‌
– ఇక్కడి 10 స్థానాలే కీలకం
– జె.జగదీష్‌
మహారాష్ట్రలో ఈసారి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. శివసేన ఇప్పుడు ఉద్ధవ్‌, షిండే గ్రూపుల కింద చీలిపోయింది. ఎన్‌సిపి శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ గ్రూపులుగా విడిపోయింది. కాంగ్రెస్‌, శివసేన(ఉద్ధవ్‌), ఎన్‌సిపి (శరద్‌ పవార్‌) కలిసి మహా వికాస్‌ అఘాడీ(ఎంవిఎ)గా పోటీ చేస్తున్నాయి. బిజెపి, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్‌ పవార్‌) కలిసి మహాయుతి కూటమిగా ఏర్పడ్డాయి. దీంతో ఈసారి రాష్ట్రంలో రెండు కూటముల మధ్య హోరా హోరీ పోరు నెలకొన్నది. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలో పాగా వేసేందుకు రెండు కూటములు శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్నాయి.
ఎంవిఎ ఆశలన్నీ ఇక్కడే
పశ్చిమ మహారాష్ట్రలో పుణే, మావల్‌, శిరూర్‌, బారామతి, షోలాపూర్‌, మధ, సతారా, సంగ్లి, కొల్హాపూర్‌, హట్కనంగలె లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అందులో బారామతి, షోలాపూర్‌, మధ, సంగ్లి, సతారా, కొల్హాపూర్‌, హట్కనంగలె నియోజకవర్గాలకు మూడో దశలో ఎన్నికలు జరిగాయి. ఇంకా పుణే, మావల్‌, శిరూర్‌ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ప్రాంతం గతంలో ఎన్సీపి, కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. 2019లో ఎన్‌సిపి 3, బిజెపి 4, శివసేన 3 సీట్లు గెలిచాయి. మొత్తం మహారాష్ట్రలో ఎంవిఎ ఈ ప్రాంతంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నది.
శరద్‌ పవార్‌కు కంచుకోట
పశ్చిమ మహారాష్ట్రలో చెరుకు రైతులు ఎక్కువ. ఈ ప్రాంతాన్ని షుగర్‌ బెల్ట్‌ అని పిలుస్తారు. రైతు సహకార సంఘాల ప్రభావం ఈ ప్రాంతంలో ఎక్కువ. వీటిల్లో ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌కు మంచి పట్టు ఉంది. ఈసారి తన పార్టీలోనే చీలిక రావడంతో పవార్‌కు కఠిన పరీక్ష ఎదురవుతున్నది. దీంతో కచ్చితంగా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని పవార్‌ పట్టుదలగా ఉన్నారు.
బిజెపికి అసలైన సవాల్‌
బిజెపికి మహారాష్ట్రలో ప్రతి సీటూ కీలకంగా మారింది. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలోని పది స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునేందుకు బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అజిత్‌ పవార్‌ ద్వారా ఎన్‌సిపి బలాన్ని తగ్గించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. అయితే, ఈ ప్రాంతంలో ఎన్‌సిపి (శరద్‌ పవార్‌), కాంగ్రెస్‌ ఇప్పటికీ బలంగా ఉండటం, శివసేన(ఉద్ధవ్‌) కూడా కొన్ని చోట్ల బలంగా ఉండటం బిజెపికి సవాల్‌గా మారింది.

ఈసారి సగమైనా వస్తాయా?
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యతో దేశంలోనే ఉత్తరప్రదేశ్‌ తర్వాతి స్థానం (రెండవ)లో ఉన్న మహారాష్ట్రలో బిజెపి, దాని మిత్రపక్షాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. 2019లో 48 సీట్లకు గాను 41 సీట్లు గెలుచుకున్న ఎన్డీయే ఈసారి అందులో సగమైనా గెలుస్తామా అన్న భయం బిజెపి కూటమిలో కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌ ప్రభావం అంతంత మాత్రమే. ప్రచారానికి నాయకత్వం వహించిన ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షాలకు స్పందన అంతగా లభించలేదు. ప్రధాని మహారాష్ట్రలో ఇప్పటివరకు 12 పర్యటనలు చేశారు. మంగళవారం నాటి ఎన్నికల తరువాత మే 13, 20 తేదీల్లో మరో రెండు దశలు మిగిలి ఉన్నాయి. శివసేన, ఎన్‌సిపిలను చీల్చి వాటితో జత కట్టడం, పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్‌ నేతలకు సీట్లు ఇవ్వడం తమకు ఇబ్బందికరమని బిజెపి రాష్ట్ర నేతలు అంటున్నారు. వివిధ కేంద్ర ఏజెన్సీల విచారణలో ఉన్న డజను మందికిపైగా బిజెపి కూటమి అభ్యర్థులుగా ఉన్నారు. ఇంతకాలం అవినీతి పరులుగా అభివర్ణించిన వారికే ఓట్లు అడగాల్సిన పరిస్థితి బిజెపి కార్యకర్తలది. మరోవైపు అజిత్‌ పవార్‌ తన భార్య సునేత్ర పోటీ చేస్తున్న బారామతిని వదిలిపెట్టలేదు. ప్రధాని ర్యాలీకి కూడా హాజరుకాలేదు.మరోవైపు శరద్‌ పవార్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రతిపక్ష కూటమిలో ఉత్సాహం నింపుతున్నారు. మరోవైపు బిజెపి అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు ముంబై నార్త్‌ సెంట్రల్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎంపి పూనమ్‌ మహాజన్‌కు సీటు నిరాకరించడం సర్వత్రా నిరసనలకు దారితీసింది. జలగావ్‌లో పోటీ చేయాలని భావించిన ఉజ్వైన్‌ నిగమ్‌ ఇక్కడ పోటీ చేస్తున్నారు.

Spread the love