మాస్కోలో విక్టరీ పరేడ్‌

– అంతర్జాతీయ ఘర్షణలు పెచ్చరిల్లకుండా చూస్తామన్న పుతిన్‌
మాస్కో: నాజీ జర్మనీపై 1945లో సోవియట్‌ యూనియన్‌ సాధించిన విజయం 79వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ రెడ్‌ స్క్వేర్‌ వద్ద గురువారం వార్షిక మిలటరీ పరేడ్‌ జరిగింది. పరేడ్‌కు ముందు బలగాలను, అతిథులను ఉద్దేశించి అధ్యక్షుడు పుతిన్‌ ప్రసంగించారు. నాజీయిజంపై పోరాడి అసువులు బాసిన సైనికులందరికీ ఘనంగా నివాళులర్పించారు. జపాన్‌ సైనికవాదానికి వ్యతిరేకంగా చైనీయులు ప్రదర్శించిన సాహసాన్ని గౌరవించారు. ఉమ్మడి పోరాట చరిత్రను, అలయన్స్‌ స్ఫూర్తిదాయకమైన సాంప్రదాయాన్ని రష్యా ఎన్నడూ మరిచిపోదన్నారు. కొన్ని పశ్చిమ దేశాలు చరిత్రను వక్రీకరిస్తూ పునర్విచారణ జరపడాన్ని, కొత్తగా ప్రాంతీయ ఘర్షణలను రెచ్చగొట్టడానికి ఉద్దేశించబడిన నాజీవాదాన్ని ప్రస్తుతం అనుసరించే వారిని సమర్ధించడానికి ప్రయత్నించడాన్ని పుతిన్‌ తీవ్రంగా విమర్శించారు. అంతర్జాతీయ ఘర్షణలు పెచ్చరిల్లకుండా నివారించడానికి రష్యా చేయగలిగిందంతా చేస్తుందని పుతిన్‌ అన్నారు. అదే సమయంలో, తమను ఎవరైనా బెదిరించడానికి కూడా అనుమతించబోమన్నారు. రష్యా వ్యూహాత్మక బలగాలు ఎప్పుడూ పోరాటానికి సిద్ధంగా వుంటాయన్నారు. రష్యా ప్రస్తుతం ఒక క్లిష్టమైన దశలో సాగుతోందని, మాతృభూమి భవిష్యత్తు మనలో ప్రతి ఒక్కరిపై ఆధారపడి వుంటుందని అన్నారు. రష్యాకు, ప్రజలకు స్వేచ్ఛతో కూడిన సురక్షితమైన భవితవ్యాన్ని అందివ్వగలననే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఆధునిక ఆయుధ వ్యవస్థల ప్రదర్శన
తొమ్మిది వేల మంది సైనికులు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. 70 మిలటరీ శకటాలు, ఇతర ఆయఢాలను, పరికరాలను ప్రదర్శించారు. రష్యా జాతీయ పతాకాన్ని, సోవియట్‌ విజయ పతాకాన్ని స్వ్కేర్‌లోకి తీసుకువస్తూ గౌరవ వందనం చేయడంతో పరేడ్‌ ప్రారంభమైంది. ఆధునిక, వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థలు, మిస్సైల్‌ లాంచర్లతో సహా పలు ఆధునిక ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించారు. రెడ్‌ స్క్వేర్‌ మీదుగా యుద్ధ విమానాలు వైమానిక విన్యాసాలతో పరేడ్‌ ముగిసింది. ఈ సందర్భంగా రష్యావ్యాప్తంగా పలు నగరాల్లో కూడా ఇదే తరహాలు ఉత్సవాలు జరిగాయి.

Spread the love