పదేండ్లుగా అటవీ అనుమతులు పెండింగ్‌ అమలుకాని ప్రధాని సడక్‌ యోజన

– రోడ్లు వేయకుండా కేంద్రం అడ్డగింత
– చట్టాల పేరుతో ఆలస్యం
– ఎనిమిది జిల్లాల్లో అవస్థలు
– అమీతుమీకి పీఆర్‌ ఇంజినీరింగ్‌ శాఖ సన్నద్ధం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ప్రజారవాణాను అడ్డుకుంటున్నది. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో రోడ్లు వేయడానికి ఆటంకాలు సృష్టిస్తున్నది. చట్టాల అమలు పేరుతో ఆయా జిల్లాల్లోని స్థానిక ప్రజలు, గిరిజనులను ముండ్లబాటలో నడిపిస్తున్నది. రవాణా సౌకర్యాన్ని దూరం చేస్తున్నది. మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, వాటి అమలుపేరుతో ఏండ్ల తరబడి అనుమతులు జాప్యం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమంత్రి సడక్‌ యోజన(పీఎంజీఎస్‌వై) పథకాన్ని రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలుచేయడం లేదు. కన్వర్జేషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ యాక్ట్‌, వైల్డ్‌ లైఫ్‌ యాక్డ్‌ పేరుతో కేంద్ర అటవీ శాఖ కొర్రీలపై కోర్రీలు వేస్తూ మారుమూల గిరిజన ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ రోడ్ల నిర్మించే అవకాశం లేకుండా చేస్తున్నది. పైపెచ్చు ఉమ్మడి రాష్ట్రంలో ‘మా అనుమతి లేకుండా మట్టిరోడ్లు, బ్రిడ్జీలు కట్టారంటూ కేసులు పెడతామని బెదిరిస్తున్నది. దీనిపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖ యంత్రాంగం తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. ఇక అమీతుమీ తేల్చుకోవడానికి సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రత్యేక నివేధిక తయారుచేసే పనిలో నిమగమైంది. కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రితోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించాక కేంద్ర అటవీ శాఖతో సంప్రదింపులు చేయడం ద్వారా సమస్యను వీలైనంత వేగంగా పరిష్కరించేందుకు రంగం సిద్ధంచేస్తున్నట్టు వినికిడి.
44 రోడ్లు..
కేంద్ర ప్రభుత్వం గత పదేండ్లల్లో రాష్ట్రానికి ప్రధానమంత్రి సడక్‌ యెజన(పీఎంజీఎస్‌వై) కింద మూడు సార్లు రోడ్లు మంజూరు చేసింది. ఎనిమిది జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీరింగ్‌ శాఖ సంబంధిత పీఎంజీఎస్‌వై రోడ్లను నిర్మించడానికి ఏండ్ల తరబడి ప్రయత్నాలు చేస్తున్నది. పీఎంజీఎస్‌వై-1, పీఎంజీఎస్‌వై-2, పీఎంజీఎస్‌వై-3 ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఇందులో పీఎంజీఎస్‌వై-2 రోడ్ల నిర్మాణం ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పూర్తయ్యాయి. మిగతా రెండు ప్రాజెక్టులకు సంబంధించి మాత్రం తీవ్ర ఆలస్యమవుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రం నుంచే ఈ మేరకు కొంత కసరత్తు జరుగుతున్నా, ఇంకా సాగదీస్తూనే ఉండటం గమనార్హం. కేంద్ర అటవీ శాఖ మాత్రం నిబంధనల పేరుతో ఎటూతేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో రోడ్లు వేయకుండా అడ్డుకుంటున్నది. చట్టాన్ని గౌరవించాల్సి ఉన్నా, చర్చించకుండా సాకులు చెబుతూ ఆలస్యం చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఎనిమిది జిల్లాల్లోని 44 రోడ్లు ఏండ్లతరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. రిజర్వ్‌ ఫారెస్ట్‌ యాక్ట్‌ కిందకు వచ్చేవి 18 రోడ్లు కాగా, వైల్డ్‌ లైఫ్‌ యాక్ట్‌ కిందకు వచ్చేవి మరో 26 ఉన్నాయి. సుమారు 138 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించకుండా పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖను నిలువరిస్తున్నది.
రిజర్వ్‌ ఫారెస్ట్‌ను కాపాడాల్సిందే. అడవుల్లో జంతుజాతి జీవనానికి ఆటంకం కలగకుండా చూడాల్సిందే. పర్యావరణ సమతుల్యతను సంరక్షించాల్సిందే. అయితే చట్టం అమలు చేసే సాకుతో రోడ్లు వేయకుండా ఆలస్యం చేయడాన్ని ఉన్నతాధికారులు తప్పుబడుతున్నారు.
ఎనిమిది జిల్లాల్లో..
రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల్‌, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో రోడ్ల నిర్మాణానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. మార్గదర్శకాల పేరుతో పీఎంజీఎస్‌వై-1, పీఎంజీఎస్‌వై-3 ప్రాజెక్టులను అమలుకాకుండా ఇబ్బంది పెడుతున్నది. ఈమేరకు పలుమార్లు కేంద్ర అటవీ శాఖకు పీఆర్‌ ఇంజినీరింగ్‌ శాఖ లేఖలు రాసినా ప్రయోజనం ఉండటం లేదు. పైగా సంబంధిత శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకే అల్టీమేటమ్‌ ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 2012 ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చేసిన రోడ్ల నిర్మాణాలను కేంద్ర అటవీ శాఖ తప్పుపడుతున్నట్టు సమాచారం. ఆయా జిల్లాల్లోని మారు మూల గిరిజన, ఇతర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కత్తిమీద సాముగా మారింది. దాదాపు 138 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం కోసం దాదాపు పది సంవత్సరాలుగా ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అయితే స్థానిక ప్రజలు, గిరిజనులతోపాటు ప్రజాప్రతినిధుల నుంచి త్వరితగతిన రోడ్ల నిర్మాణం చేపట్టాలంటూ ఇంజినీరింగ్‌ శాఖ ఒత్తిడి చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం ఉన్నతాధికారులపై పదే పదే కలుస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు అటు కేంద్రం నుంచి, ఇటు ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, ఒత్తిళ్లను తట్టుకోవడం ఒకింత కష్టంగా ఉన్నట్టు సమాచారం. దీనిపై రాష్ట్ర అటవీశాఖ పీసీసీఎఫ్‌ సైతం కేంద్ర అటవీశాఖతో సంప్రదింపులు చేశారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈనేపథ్యం లో సమస్య పరిష్కారానికి పీఆర్‌ ఇంజినీరింగ్‌ అధికా రులు నడుం బిగించారు. ఈనెల ఐదున కేంద్ర పంచా యతీరాజ్‌ మంత్రి శైలేంద్రకుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీఆర్‌ ఇంజినీరింగ్‌ అధికారులు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాన సడక్‌ యోజన అమలుపై చర్చించనున్నారు. ఇందులోనే పీఎంజీఎస్‌వై రోడ్ల నిర్మాణానికి పరిష్కారం దొరుకుతుందనే ఆశాభావం తో పీఆర్‌ ఇంజినీరింగ్‌ అధికారులు ఉన్నట్టు తెలిసింది.

Spread the love