ప్రతిపక్షాల భేటీ వాయిదా

–  ఈనెల 17-18న సమావేశం : కాంగ్రెస్‌
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ప్రతిపక్షాల బెంగళూరు సమా వేశం వాయిదా పడింది. ఈనెల 12, 13 తేదీల్లో భేటీ కావాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు. ఈసారి సమావేశాన్ని కాంగ్రెస్‌ ఏర్పాటు చేసింది. గత నెల 23న పాట్నాలో తొలిసారిగా భేటీ అయింది. గత సమావేశాన్ని బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఏర్పాటు చేశారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)లో చీలిక నేపథ్యంలో ఈసారి భేటీకి మరింత ప్రాధాన్యత చోటు చేసుకుంది. ప్రతిపక్ష భాగస్వామ్య పార్టీలతో మాట్లాడి తదుపరి తేదీ నిర్ణయిస్తామని కాంగ్రెస్‌ తెలిపింది. అయితే పార్లమెంట్‌ సమావేశాలు జులై 20న ప్రారంభం కానున్నాయి. అలాగే బీహార్‌ అసెంబ్లీ సమావేశాలు జులై 10 నుంచి 24 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల భేటీని వాయిదా వేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ కోరినట్టు తెలిసింది. దీనిపై జేడీయూ నేత కెసి త్యాగి స్పందిస్తూ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల అనంతరం ఈ భేటీ జరగనుందని, ఆ తేదీని తరువాత ప్రకటిస్తామని అన్నారు. అయితే ఈ వార్తలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కెసి వేణుగోపాల్‌ స్పందిస్తూ బెంగళూర్‌ వేదికగా ప్రతిపక్షాల తదుపరి భేటీ జులై 17-18న జరగనుందని ట్వీట్‌ చేశారు.

Spread the love