నియంతృత్వ ఆర్డినెన్స్‌ని వెనక్కి తీసుకోవాలి

– మోడీ నిరంకుశ పాలనను అంతం చేయాలి
– ఢిల్లీలో వామపక్షాల ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రజలు చేత ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నియంతృత్వ ఆర్డినెన్స్‌ని వెనక్కి తీసుకోవాలని సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ (ఎన్సీటీ) ప్రభుత్వం దేశ రాజధానిలో పరిపాలనా సేవలు, శాసన, కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ బుధవారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌ వద్ద సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌), ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, సీజీపీఐ ఢిల్లీ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. మహిళలు సహా వందలాది మంది ప్రజలు ఆందోళనలో పాల్గొన్నారు. హౌం మంత్రిత్వ శాఖ వైపు కవాతు చేయకుండా నిరోధించడానికి ఢిల్లీ పోలీసులు అన్ని వైపుల నుంచి బారికేడ్లు వేశారు. నిరసనకారులను ఉద్దేశించి కెఎం తివారీ మాట్లాడుతూ పదే పదే ఎన్నికల పరాజయాలు ఎదురైనప్పటికీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తో ఢిల్లీని పాలించే మోడీ ప్రభుత్వం తాజా చర్యను ఖండించారు. ఈ నిరంకుశ, నియంతృత్వ పాలనను అంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ‘సహకార సమాఖ్య నిర్మాణం’పై ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ చర్యలు, విరుద్ధమైన ప్రవర్తనను కూడా బహిర్గతం చేశారు. వామపక్షాలన్నీ ఈ ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయని అన్నారు. ఈ ఆర్డినెన్స్‌ ఢిల్లీ ప్రజల హక్కులపై దాడి చేయడమేనని సీపీఐ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్‌ దినేష్‌ వర్షణ్యే అన్నారు. ఢిల్లీలో పరోక్ష పూర్తి పాలనను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతించమని, ఢిల్లీలో ఎన్నికైన ముఖ్యమంత్రిని చీఫ్‌ సెక్రెటరీ, బ్యూరోక్రాట్‌ ఎలా అధిగమిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ఆర్డినెన్స్‌ రాజ్యాంగ సమాఖ్య లక్షణానికి విరుద్ధమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శులు రవి రారు (సీపీఐ ఎంఎల్‌), ఆర్‌ఎస్‌ డాగర్‌ (ఆర్‌ఎస్‌పీ), ధర్మేంద్ర కుమార్‌ వర్మ (ఏఐఎఫ్‌బీ), బిర్జు నాయక్‌ (సీజీపీఐ), సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు ఆశాశర్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love