రేవంత్‌రెడ్డి.. తెలంగాణకు పట్టిన వ్యాధి

– బీజేపీవి.. పొద్దున లేస్తే హిందు, ముస్లిం గొడవలే
– ఎంపీ అరవింద్‌ సంస్కారహీనుడు : నిజామాబాద్‌లో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-నిజామాబాద్‌సిటీ/నిజామాబాద్‌ రూరల్‌
‘మూడు గంటలు కరెంట్‌ ఇచ్చే కాంగ్రెస్‌ కావాలా? మతం మంటల బీజేపీ కావాలా? మూడు పంటలు పండించే కేసీఆర్‌ కావాలో మీరే తేల్చాలి. రేవంత్‌ రెడ్డి నువ్వు నిఖార్సయిన తెలంగాణ వాదివా? తెలంగాణ వాదివి కావు.. తెలంగాణకు పట్టిన వ్యాధివి. నోట్ల కోసం ఓట్లు అమ్ముకున్న క్రిమినల్‌వి. రైతులకు మూడు గంటలు కరెంట్‌ ఇస్తే చాలు అంటావా? కాంగ్రెస్‌లో నువ్వు కూర్చోవాలన్నా.. నిలబడాలన్న.. ఢిల్లీకి వెళ్లి అనుమతి తీసుకోవాలి’ అంటూ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. నిజామాబాద్‌ నగరంలో బుధవారం పర్యటించిన మంత్రి కేటీఆర్‌.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. నిజామాబాద్‌ ఐటీ హబ్‌ను ప్రారంభించిన అనంతరం ఎన్‌ఏసీ సెంటర్‌ను ప్రారంభించారు.
అనంతరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన కార్యాలయంతో పాటు, మినీ ట్యాంక్‌ బండ్‌, అత్యాధునిక హంగులతో నిర్మించిన శ్మశానవాటికను మంత్రి వేముల, ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తతో కలిసి ప్రారంభించారు. మధ్యాహ్నం మున్సిపల్‌ కార్మికులతో సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీజేపీపై ఫైర్‌ అయ్యారు. హంతకుడే సంతాపం తెలిపినట్టుగా 50 ఏండ్ల నుంచి ఏమి అభివృద్ధి చేయకుండా ఇప్పుడు ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తామని రేవంత్‌ రెడ్డి అంటున్నాడని విమర్శించారు. మీ నాయకులంతా ఢిల్లీలో ఉంటారని, గల్లీలో ఏం జరిగినా మీరు ఢిల్లీకి వెళ్లాలని, కానీ బీఆర్‌ఎస్‌ పార్టీలో నాయకులు అందరూ గల్లీలోనే ఉంటారని, ఎవరికీ ఏ ఆపద వచ్చినా గల్లీ నాయకులను కలవచ్చని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, ఇవన్నీ ఒక్క కేసీఆర్‌ తోటే సాధ్యమయ్యాయన్నారు. నేటి పరిస్థితుల్లో కుంభకోణాల కాంగ్రెస్‌ను, మతోన్మాద బీజేపీని నమ్మొద్దని స్పష్టంచేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి జన్‌ ధన్‌ పేరిట దనాధన్‌ అకౌంట్‌ తీసి ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు పడతాయన్నారని.. ఏ ఒక్కరికైనా ఇంతవరకు పడ్డాయా.. అని ప్రశ్నించారు. పొద్దున లేచిన్నుంచి హిందూ ముస్లిం పంచాయతీ తప్ప ఏమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.400 సిలిండర్‌ ధర ఉంటే పిరమాయే అన్న బీజేపీ.. ఇప్పుడు తమ ప్రభుత్వంలో రూ.1200లకు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా రూ.70 ఉన్న పెట్రోల్‌ను రూ.115కు పెంచారని, బ్యారెల్‌ ధర తగ్గినా పెట్రోల్‌, డీజిల్‌ ధర పెంచారని, దాంతో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగాయని తెలిపారు. బీజేపీ వాళ్లు ఎవరైనా కలిస్తే.. ఈ తొమ్మిందేండ్లలో వారు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలు గల్లబట్టి నిలదీయాలని సూచించారు. నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ తనకంటే వయస్సులో పెద్దవారైన, తండ్రితో సమానమైన సీఎం కేసీఆర్‌ గురించి చిల్లర మల్లరగా మాట్లాడుతున్నారని, ఇది పద్దతేనా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని సంస్కారవంతంగా మాట్లాడే ప్రయత్నం చేయాలని, అరవింద్‌ ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్‌ దక్కకుండా ఓడిస్తామని తెలిపారు.

 

Spread the love