గాంధీ మునిమనవడు అరెస్టు

– మహా పోలీసుల నిర్భంధంలో తుషార్‌ గాంధీ, తీస్తా సెతల్వాద్‌
ముంబయి : క్విట్‌ ఇండియా డే నిరసనల్లో పాల్గొనకుండా మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్‌ గాంధీ, ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ను మహారాష్ట్ర పోలీసులు బుధవారం నిర్భంధించారు. శాంత క్రూజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో తనను నిర్భంధించినట్టు తుషార్‌ గాంధీ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ఆగస్టు 9న క్విట్‌ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంటి నుంచి బయలుదేరిన నన్ను స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా శాంత క్రూజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్భంధించారు. తాతయ్యను బ్రిటీష్‌ పోలీసులు అరెస్టు చేసిన చారిత్రాత్మక తేదీనే నన్ను కూడా అరెస్టు చేసినందుకు గర్వ పడుతున్నాను’ అని తుషార్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ‘పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరడానికి నాకు అనుమతి లభించిన వెంటనే నేను ఆగస్టు క్రాంతి మైదాన్‌కు వెళ్తాను. ఆగస్టు కాంత్రి దిన్‌ను, అమరవీరులను స్మరించుకుంటాను’ అని కూడా మరో ట్వీట్‌ చేశారు. మరికొద్ది సేపటి తరువాత తనకు అనుమతి లభించిందని, ఆగస్టు క్రాంతి మైదాన్‌కు వెళుతున్నట్లు తుషార్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.
మరోవైపు, తీస్తా సెతల్వాద కూడా ఇదే విధంగా ట్వీట్‌ చేశారు. ‘మహారాష్ట్రలో పోలీసు రాజ్యం. ఇరవై మంది పోలీసుల బృందం జుహూలోని నా ఇంటి బయట నిలబడి నన్ను జిజి పారిల్‌ మోర్చాలో పాల్గొననీయకుండా అడ్డుకుంది’ అని ట్వీట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్‌ చేశారు. 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు గత నెల 19న బెయిల్‌ మంజారు చేయడంతో తీస్తా సెతల్వాద ప్రస్తుతం బయట ఉన్నారు. కాగా, తనపై నమోదైన 2002 గుజరాత్‌ అల్లర్ల కేసును కొట్టివేయాలని తీస్తా సెతల్వాద్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను అత్యవసరంగా విచారించడానికి గుజరాత్‌ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. సాధ్యమైనంత త్వరగా పిటీషన్‌ను విచారిస్తామని జస్టిస్‌ సందీప్‌ భట్‌ నేతృత్వంలోని సింగిల్‌ జడ్జి ధర్మాసనం తెలిపింది. 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్‌ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులను ఇరికించేందుకు కుట్ర పన్నారని, నకిలీ సాక్ష్యాలను రూపొందించారనే ఆభియోగాలను తీస్తా సెతల్వాద్‌ ఎదుర్కొంటున్నారు.

Spread the love