గాంధీ స్మారక భవనం కూల్చివేత

Demolition of Gandhi Memorial Building– బుల్డోజర్లతో తెగబడుతున్న యోగి సర్కార్‌
– వారణాసిలో సర్వ సేవా సంఫ్‌ నిర్మాణాలు నేలమట్టం
– గాంధేయవాదుల నిరసన
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని రఘత్‌ ప్రాంతంలో గాంధీ సామాజిక సేవా సంస్థ అఖిల భారత సర్వ సేవా సంఫ్‌కు చెందిన 12 భవనాలను కూల్చివేయటం ఆందోళనకు దారి తీసింది. శనివారం 15 నుంచి 20 వరకు భవనాలను కూల్చివేసినట్టు కొన్ని మీడియా నివేదికలు వెల్లడించాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కూల్చివేత కసరత్తు 500 మంది పోలీసుల సమక్షంలో జరిగింది. స్వాతంత్య్ర సమరయోధుడు జయప్రకాష్‌ నారాయణ్‌ సహ-స్థాపన చేసిన గాంధీ విద్యా సంస్థాన్‌ను కూడా నేలమట్టం చేయడానికి ఆరు బుల్‌డోజర్‌లు రంగంలోకి దిగినట్టు వార్తలు వెలువడ్డాయి.
ఈ కూల్చివేతకు వ్యతిరేకంగా పలువురు గాంధేయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ వారసత్వాన్ని నాశనం చేసే ప్రయత్నమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలు చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తప్పుబట్టిన కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, యూపీ ఇన్‌చార్జీ ప్రియాంక గాంధీ వాద్రా తన ఫేస్‌బుక్‌ పేజీలో ఈ కూల్చివేతను ”జాతి పిత మహాత్మా గాంధీ వారసత్వంపై దాడి”గా అభివర్ణించారు. కాంగ్రెస్‌ నాయకుడు జైరాం రమేష్‌ కూడా ఈ చర్యను ఖండించారు. బీజేపీ తన హద్దులను దాటిపోతున్న దని ఆరోపించారు. మేధా పాట్కర్‌, యోగేంద్ర యాదవ్‌, రాకేష్‌ టికాయత్‌ వంటి సామాజిక కార్యకర్తలు కూడా ఈ కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన వందలాది మందిలో ఉన్నారు.

Spread the love