ఆహార ధాన్యాల నిల్వ కోసం గిడ్డంగుల సామర్థ్యం పెంపు

– దీనికోసం రూ. లక్ష కోట్లు ఖర్చు
– తొలుత పది జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు : కేంద్రమంత్రివర్గం నిర్ణయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల నిల్వ కోసం గిడ్డంగుల సామర్థ్యాన్ని పెంచాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా సహకార రంగంలో పెద్ద ఎత్తున గోదాములను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 700 లక్షల టన్నుల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ పథకం కింద రూ. లక్ష కోట్లు ఖర్చు చేయనున్నారు. వృత్తిపరమైన పద్ధతిలో ప్రణాళిక కాలపరిమితి, ఏకరీతి అమలును నిర్ధారించడానికి సహకార మంత్రిత్వ శాఖ దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఎంపిక చేసిన కనీసం పది జిల్లాలలో పైలట్‌ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తుంది. ఈ మేరకు బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. సమావేశ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. ”సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రణాళిక” సులభతరం కోసం ఒక అంతర్‌ మంత్రిత్వ కమిటీ (ఐఎంసీ) రాజ్యాంగం, సాధికారతకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. దేశంలో ప్రస్తుతం గిడ్డంగుల సామర్థ్యం 1,450 లక్షల టన్నులుగా ఉందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. రాబోయే ఐదేండ్లలో దాన్ని 2,150 లక్షల టన్నులకు పెంచాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. సహకార రంగంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ కార్యక్రమంగా దీన్ని అభివర్ణించారు. ప్రతి జిల్లాలో 2 వేల టన్నుల సామర్థ్యంతో గోదాములు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆహార పదార్థాల వృథాను తగ్గించేందుకే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. గిడ్డంగుల సదుపాయం లేక ఆహార ధాన్యాలు వృథా అవుతున్నాయన్నారు. ఈ గోదాముల ఏర్పాటుతో నష్టానికి తమ ఉత్పత్తులను రైతులు విక్రయించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. దిగుమతులు తగ్గడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని తెలిపారు. రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ఆహార భద్రతకు డోకా ఉండదని చెప్పారు. ప్రతి బ్లాకులోరెండు వేల టన్నుల సామర్థ్యం గల గోడౌన్‌ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలో ఏటా 3,100 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండుతుండగా.. కేవలం 47 శాతం ఉత్పత్తులను మాత్రమే నిల్వ చేయడానికి అవకాశం ఉంటోంది.
ఢిల్లీలో యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌ ప్రాంతీయ కార్యాలయం
యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌ ప్రాంతీయ కార్యాలయం న్యూఢిల్లీలో ఏర్పాటు చేయటానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. యుపియుతో ఒప్పందం కుదుర్చుకోవటంతో ఈ ప్రాంతంలో యుపియు అభివృద్ధి సహకారానికి, సాంకేతిక సహాయానికి దేశం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. తపాలా రంగంలోని వివిధ సంస్థలలో చురుకైన పాత్ర పోషిస్తూ త్రిముఖ సహకారానికి పాటుపడుతుందని అన్నారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో దేశ ఉనికి అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతుందని పేర్కొన్నారు.
సిటీస్‌ 2.0కు ఆమోదం
సిటీ ఇన్వెస్ట్‌ మెంట్స్‌ టూ ఇన్నొవేట్‌, ఇంటిగ్రేట్‌ అండ్‌ సస్టెయిన్‌ 2.0 ( సిటీస్‌ 2.0) కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫ్రెంచ్‌ డెవలప్‌ మెంట్‌ ఏజెన్సీ క్రెడిటాన్‌ సాల్ట్‌, యూరోపియన్‌ యూనియన్‌, పట్టణ వ్యవహారాల జాతీయ సంస్థ భాగస్వామ్యంతో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం 2023 నుంచి 2027 వరకు నాలుగేండ్ల పాటు నడుస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

Spread the love