జార్ఖండ్‌లో 40 కిలోల టమాట చోరీ

నవతెలంగాణ – రాంచీ: టమాట ధరలు రోజు రోజుకు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో టమాట చోరీలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా కూరగాయల షాపుల నుంచి 40 కిలోల టమాటాలను లూఠీ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తంగ్రా కూరగాయల మార్కెట్‌లోని 66 షాపుల నుంచి సుమారు 40 కిలోల టమాటాలు, పది కిలోల అల్లం, రెండు లక్షల విలువైన తూకం యంత్రాలు, డబ్బు, విలువైన వస్తువులు చోరీ అయ్యాయి. కాగా, శనివారం ఉదయం మార్కెట్‌కు వచ్చిన కూరగాయల వ్యాపారులు తమ షాపుల తాళాలు పగులగొట్టి ఉండటం చూసి షాకయ్యారు. అలాగే 40 కిలోల టమాటాలు, పది కిలోల అల్లం, తూకం యంత్రాలు చోరీ అయ్యినట్లు తెలుసుకుని ఆందోళన చెందారు. వారంతా కలిసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే ఈ చోరీపై నిరసనగా కూరగాయల మార్కెట్‌లోని వ్యాపారులు శనివారం తమ షాపులను మూసివేశారు. మరోవైపు టమాటాల దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగలను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని చెప్పారు.

Spread the love