గృహిణి సేవలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు…

supreme courtనవతెలంగాణ – హైదరాబాద్
ఇంటిపని, వంటపని చేస్తూ సమయానికి కుటుంబానికి ఏం కావాలో అది అందిస్తూ చక్కగా ఇంటిని నిర్వహించే భార్య సేవలు వెలకట్టలేనివని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆమె సేవలను డబ్బు కోణంలో చూడడం తగదని పేర్కొంది. ఓ యాక్సిడెంట్ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2006లో ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి బీమా సౌకర్యం లేకపోవడంతో వాహన యజమాని ఆమెకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. కేసును విచారించిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ మృతురాలి కుటుంబానికి (భర్త, ఆమె మైనర్ కుమారుడు) రూ. 2.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఆ మొత్తాన్ని పెంచాలని కోరుతూ బాధిత కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను హైకోర్టు 2017లో కొట్టివేసింది. మహిళ గృహిణి కాబట్టి ఆమె ఆదాయం పరిమితమని, కాబట్టి ఆమెకు ఇవ్వాల్సిన పరిహారం ఫిక్స్‌డ్‌గా ఉంటుందని, కనీస ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లించడం సబబేనని తేల్చి చెప్పింది. హైకోర్టును తీర్పును బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బాధిత కుటుంబానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. గృహిణి సేవలను తక్కువగా అంచనా వేయడం సరికాదని, ఒకదాని తర్వాత ఒకటిగా ఇంటి పనులు చక్కబెట్టే ఆమె సేవలను ఆర్థిక కోణంలో తగదని, ఇంట్లో సంపాదించే వ్యక్తికి ఆమె ఏమీ తక్కువ కాదని పేర్కొంది. ఆమె సేవలను వెలకట్టలేమనడంలో సందేహం లేదని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. గృహిణి ఆదాయాన్ని దినసరి కూలీ కంటే తక్కువగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించింది. బాధిత కుటుంబానికి రూ. 6 లక్షల పరిహారాన్ని ఆరు వారాల్లోపు ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.

Spread the love